close

ప్రధానాంశాలు

గుంపులుగా చేరొద్దు

అలా అయితే లాక్‌డౌన్‌ లక్ష్యం నెరవేరదు
నిత్యావసరాల దుకాణాలపై ఆందోళన చెందాల్సిన పని లేదు
రేషన్‌ కార్డులపై ఒక్కొక్కరికి అదనంగా 2 కిలోల బియ్యం
కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ని ప్రకటించినప్పటికీ అన్నిరకాల నిత్యావసర సరకులు, అత్యవసర సేవలు అందించే దుకాణాలు తెరిచే ఉంటాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పష్టం చేశారు. జనం ఎగబడకుండా నిదానంగా కొనుగోళ్లు చేయాలని హితవు పలికారు. గుంపులుగా దుకాణాల వద్ద గుమిగూడితే లాక్‌డౌన్‌ లక్ష్యమే పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రజల్ని రక్షించేందుకు తప్పనిసరి
‘‘ప్రధానమంత్రి ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశమంతా స్వాగతిస్తోంది. ప్రపంచ దేశాల అనుభవాలను చూశాక 130 కోట్ల జనాభాను రక్షించుకోవడానికి ఇది తప్పనిసరి అయింది. లాక్‌డౌన్‌ వల్ల కొంతమేర ఇబ్బందులు తలెత్తే మాట వాస్తవం. ప్రజలు పెద్దఎత్తున దుకాణాలకు వెళ్లడం ఆందోళనకరం. ఇకనైనా దీనిని తగ్గించుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులందరికీ యథావిధిగా వేతనాలు అందుతాయి. పేదలు, ఒప్పంద కార్మికులకు చౌకగానో, ఉచితంగానో తిండి గింజలు అందిస్తాం’’. అని మంత్రి సూచించారు.

జిల్లాకొక హెల్ప్‌లైన్‌
జిల్లాకొక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలకు చెప్పామనీ, కేంద్ర హోంశాఖ కూడా త్వరలో హెల్ప్‌లైన్‌ నంబర్‌ ప్రకటించబోతోందని జావడేకర్‌ తెలిపారు. దేశంలోని 80 కోట్లమంది రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి 2 కిలోల చొప్పున రాయితీపై బియ్యం లేదా గోధుమలు అదనంగా సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కేబినెట్‌లోనూ సామాజిక దూరం
కేబినెట్‌ సమావేశాల్లో మంత్రులంతా పక్కపక్కన కూర్చొంటారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈసారి మాత్రం దూరదూరంగా కూర్చొన్నారు.

లాక్‌డౌన్‌పై ప్రధాని పర్యవేక్షణ
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ తీరును నేరుగా ప్రధానమంత్రి పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా సంప్రదింపులు జరపనుంది.

మరిన్ని వ్యవస్థలకు మినహాయింపు
లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మరిన్ని వ్యవస్థలను మినహాయిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. అందులో బొగ్గు, ఖనిజ ఉత్పత్తి, దాని రవాణా, మైనింగ్‌ కార్యకలాపాలతో ముడిపడిన పేలుడు పదార్థాల సరఫరాను చేర్చారు. పశువుల ఆసుపత్రులు, వాటి మందుల కేంద్రాలు, జన్‌ ఔషధి కేంద్రాలు, ఫార్మాస్యూటికల్‌ పరిశోధన ప్రయోగశాలలు తెరచి ఉంచాలన్నారు. విత్తనాలు, పురుగు మందుల దుకాణాలకూ లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ, ఆహార ఉత్పత్తులు, మందులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.


వార్తా పత్రికల పంపిణీకి అడ్డంకులొద్దు

వార్తా పత్రికల పంపిణీకి వివిధ చోట్ల ప్రభుత్వ యంత్రాంగాలు అడ్డంకులు సృష్టించడాన్ని జావడేకర్‌ ఖండించారు. వార్తాపత్రికల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేవని, వాటివల్ల కచ్చితమైన సమాచారం ప్రజలకు చేరుతుంది కాబట్టి పంపిణీకి అడ్డంకులు సృష్టించొద్దన్నారు.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.