close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
త్వరలో పురపాలక ఖాళీల భర్తీ

 సిద్దిపేటను ఆదర్శంగా తీసుకోండి
 నీరు...విద్యుత్‌ ఆడిట్‌ తప్పని సరి
 పురపాలక మంత్రి కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో ఉద్యోగ ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి ఇప్పటికే ఆమోదం కూడా తెలిపిందన్నారు. సిద్దిపేటను నమూనాగా తీసుకుని ఇతర పురపాలకసంఘాలు ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. ఛైర్మన్లు, కమిషనర్లు ఉదయం 5.30 గంటలకే క్షేత్రంలో ఉండాలన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలసి ఉమ్మడి మెదక్‌  జిల్లాలోని పురపాలక సంఘాలపై మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఇక్కడ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున్నర ఏళ్ల వరకు రాష్ట్రంలో ఎన్నికలు లేవని, దీన్ని అవకాశంగా తీసుకుని అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. ఆదర్శ మున్సిపాలిటీగా మారాలంటే ఉండాల్సిన 42 అంశాల ప్రాతిపదికగా అభివృద్ధి నమూనా పట్టికను తయారు చేశామన్నారు. వీటిని పురపాలక కమిషనర్లు, ఛైర్మన్లకు అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా గ్రామ ప్రణాళిక, పట్టణ అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పట్టణ ప్రగతి నిధులను జాప్యం లేకుండా ఇస్తోందంటూ పనులను చిత్తశుద్ధితో చేయాలన్నారు
  సరఫరా చేసిన నీటికి బిల్లులు వస్తున్నాయా?
అన్ని పురపాలక సంఘాల్లో వనరులు, విద్యుత్‌, పారిశుద్ధ్యం, నీటి ఆడిట్‌ చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఎంత నీరు సరఫరా చేస్తున్నాం?ఆ నీటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా? లేదా? అనేది పరిశీలించాలన్నారు. సింగపూర్‌లో వంద లీటర్లు సరఫరాచేస్తే 90 లీటర్లకు డబ్బులు వస్తున్నాయన్నారు. పది లీటర్ల మేరకు సరఫరా నష్టాలు ఉన్నాయన్నారు. మన దగ్గర వందలీటర్లు సరఫరా అయితే 60 లీటర్లకు కూడా డబ్బులు రావడం లేదన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు.
విద్యుత్‌ ఛార్జీలు జాప్యంలేకుండా చెల్లించాలని, ఇనుప విద్యుత్‌ స్తంభాలు ఉంటే తొలగించాలని, విద్యుత్‌ ఛార్జీలను ఆదా చేయాలని సూచించారు. డంప్‌యార్డుల నిర్వహణపై దృష్టిసారించాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి మొదటివారంలోనే రూ.12 వేల జీతం ఇవ్వాలని వారికి దుస్తులు, బూట్లు, మాస్క్‌లను అందించాలన్నారు. ఆగస్టు 15 లోపు ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వెయ్యిమందికి ఒక శౌచాలయం ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని, ఇందులో 50 శాతం షీ టాయిలెట్లు ఉండాలన్నారు. 400 పాత బస్సులను తీసుకుని మహిళల కోసం షీ టాయిలెట్లుగా అందుబాటులో ఉంచుతామన్నారు. కుక్కల బాారి నుంచి ప్రజలను కాపాడేందుకు యానిమల్‌ కేర్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. చెత్త సేకరణ, నిర్వహణలో ఆదర్శంగా ఉన్న సిద్దిపేటకు ప్రజా ప్రతినిధులు, పురపాలక అధికారులు వెళ్లి పరిశీలించాలన్నారు. తెల్లకార్డుదారులకు రూపాయికే, ఇతరులకు వంద రూపాయలకే నల్లా కనెక్షన్‌ విధానం కొనసాగించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఒకటికన్నా ఎక్కువ నర్సరీలు ఉండాలన్నారు.
ఆర్థికమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ వందశాతం తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. ప్రతి పురపాలక సంఘంలో డంప్‌యార్డు ఉండటమే కాకుండా ఆధునిక పద్ధతిలో దీన్ని నిర్వహించాలన్నారు. ఈ సమీక్షలో ఎంపీ బీబీ పాటిల్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ పూర్వ మెదక్‌  జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, పురపాలక అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.