close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాక్షస చట్టం

రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం
కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజం
ఉపసంహరించుకోవాలని ప్రధానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా..
ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

* కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్తు సవరణ బిల్లు ఆమోదం పొందితే డిస్కంలు, జెన్‌కో, ట్రాన్స్‌కో ఏమైపోవాలి? క్రాస్‌ సబ్సిడీ ఉండదు. ఈఆర్సీ మన చేతుల్లో ఉండదు. అధికారాన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే విద్యుత్తు సవరణ ప్రతిపాదనలు అత్యంత ప్రమాదకరం. ఏదైనా బిల్లు తెస్తే దానివల్ల రాష్ట్రాలకు అధికారాలు రావాలి. కానీ ఇప్పుడంతా వ్యతిరేకంగా జరుగుతోంది. ఇది రాష్ట్రాల స్వయంసమృద్ధిని, సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితో నరికే రాక్షస చట్టం.
* రాష్ట్రంలో 26 లక్షల బోర్లున్నాయి. వాటికయ్యే విద్యుత్తు ఖర్చుల కింద ప్రభుత్వం రూ. 10,000 కోట్లు చెల్లిస్తోంది. కొత్త బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపితే వాటన్నింటికీ మీటర్లు బిగించాలి. ఈ రైతులందరి నుంచి బిల్లులు వసూలు చేయాల్సి ఉంటుంది. అసలు మీటర్లు కొనడానికే రూ. 750 కోట్లు ఖర్చవుతాయి. ఒకప్పుడు గ్రామాల్లో విద్యుత్తు బిల్‌ కలెక్టరును చూస్తే జనం వణికిపోయేవారు. మళ్లీ ఆ పరిస్థితి వస్తుంది.

-అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

 

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రాల హక్కులు, అధికారాలను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగించేలా ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2003 ఇందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణలో విద్యుత్తు విజయాలు, కేంద్ర ప్రభుత్వ నూతన విద్యుత్తు సవరణ బిల్లు, శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై మంగళవారం శాసనసభలో లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రతిపాదిత బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఒక దశలో కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆమోదం పొందితే రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌, భాజపాలకు తేడా లేదని, అవి రెండూ దేశం మొత్తానికి ఉపయోగపడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోయాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని పరిపాలించిన విధానం రాజ్యాంగ ఆశయాలను ఉల్లంఘించేలాగే ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అధికారాలను రాష్ట్రాలకు వికేంద్రీకరించాలి కాని ఈ పార్టీలు ముఖ్యంగా ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం అధికారాలన్నీ తనవద్దే కేంద్రీకరించుకుంటోందని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలో 70,000 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 28,000 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. ఇంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ చెన్నై వంటి నగరాల్లో బకెట్‌ నీళ్లు దొరకడం కూడా కష్టంగా ఉందని తెలిపారు. ఇంత నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వానికీ రాలేదన్నారు.  దేశంలో విద్యుత్తు స్థాపన సామర్థ్యం 4 లక్షల మెగావాట్లు కాగా అత్యధికంగా ఇప్పటి వరకూ 2,19,000 మెగావాట్లు మాత్రమే ఉపయోగించుకున్నామని సీఎం తెలిపారు. పెద్దమొత్తంలో అదనపు విద్యుత్తు ఉన్నప్పటికీ బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో తీవ్రమైన కొరత ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా బిహార్‌ రాజధాని పట్నాలో అయితే డీజిల్‌ జనరేటర్లతో విద్యుత్తు అమ్ముకోవడం వ్యాపారంగా మారిందని వెల్లడించారు. మిగులు విద్యుత్తును దేశ ప్రగతికి ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలని, కాని అలాంటి వాటన్నింటినీ పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త విద్యుత్తు బిల్లు తెస్తోందన్నారు. దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒక్క మెగావాట్‌ కూడా ప్రైవేటుపరం కానీయబోమని కేసీఆర్‌ చెప్పారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు చాలా ప్రమాదకరంగా ఉందని, అందుకే భాజపాయేతర పరిపాలిత రాష్ట్రాలన్నీ దాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈ బిల్లుపై భాజపా నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్‌ మొదలుపెట్టినవే..: భట్టి
అంతకుముందు కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలోనూ అనేక విద్యుత్తు ప్రాజెక్టులు చేపట్టామని, ఇప్పుడున్న ప్రభుత్వం వాటినే కొనసాగిస్తోందన్నారు. తెరాస వచ్చాక భద్రాద్రి, యాదాద్రి కేంద్రాలను మాత్రమే మొదలుపెట్టారని అన్నారు. యాదాద్రి ఇంకా ప్రారంభమే కాలేదని, సాంకేతిక కారణాల వల్ల భద్రాద్రిపై అనేక అనుమానాలు నెలకొన్నాయన్నారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, దానిపై అనేక అపోహలు ఉన్నాయని చెప్పారు. ఆయన మాటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ పాలనలో విద్యుత్తు కోతలు ఎత్తివేయాలని పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసిన విషయం మర్చిపోవద్దని, ఆ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడితే చీకట్లు అలముకుంటాయని, పరిశ్రమలు రావని ఇదే సభలో చెబితే ఒక్క కాంగ్రెస్‌ సభ్యుడు కూడా నోరు మెదపలేదని ఎత్తిచూపారు. ప్రతి పనినీ విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. భద్రాద్రి విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి అవాంతరాలు కల్పించింది ఎవరో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.
ఏకగ్రీవ ఆమోదం
చర్చ అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర ప్రతిపాదించిన విద్యుత్తు బిల్లును వ్యతిరేకిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.


లాక్‌డౌన్‌లో బిల్లుల్ని పరిశీలిస్తాం.. పొరపాట్లుంటే సవరిస్తాం: సీఎం

లాక్‌డౌన్‌ కాలంలో మీటర్ల రీడింగ్‌ నమోదు చేయడం వీలుకాకపోవడం వల్ల గత ఏడాది వాడకం ప్రాతిపదికన మూడు నెలలకు సరాసరి బిల్లులను వసూలు చేశారని, దానివల్ల ప్రజలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్రమార్క చెప్పారు. వినియోగదారులు పెద్దమొత్తంలో బిల్లులు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఈ విషయం తనకు తెలియదని, పొరపాట్లు జరిగి ఉంటే సవరించేందుకు ఇప్పటికిప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నానన్నారు.


శ్రీశైలం మృతులకు శ్రద్ధాంజలి

శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో గత నెలలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి శాసనసభ శ్రద్ధాంజలి ఘటించింది. తాము చనిపోతామని తెలిసినప్పటికీ ప్లాంటుకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఆరుగురు ప్రభుత్వ సిబ్బంది, ఇద్దరు ప్రైవేటు సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడారని, వారి సేవలు మరువలేమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.