close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈసారి సెంచరీ కొడతాం

సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపాం
బతుకుతెరువుకు వచ్చిన వారంతా తెలంగాణ బిడ్డలే
ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన 8 మందికి టికెట్లిచ్చాం
మేం కూడా సిద్దిపేట నుంచి వచ్చిన వాళ్లమే
భాజపాకి దమ్ముంటే రూ. లక్ష కోట్ల ప్యాకేజీ తేవాలి
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు

అందరికీ కలుపుకొని పోవాలి
వందలమంది కష్టపడితే ఒక్క నాయకుడు వస్తాడు. నేను సిరిసిల్లలో గెలిచానంటే అదంతా కార్యకర్తల కృషే. రాష్ట్రంలో గులాబీ సైనికులు దాదాపు 60 లక్షలమంది ఉన్నారు. టికెట్‌ వచ్చిందనే గర్వం, అహం పనికి రావు. పార్టీలో టికెట్‌ కోసం మీతో పోటీ పడ్డ వారి ఇళ్లకు మొదటవెళ్లి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఓట్లు లేవని ఎవ్వరినీ తేలికగా తీసుకోవద్దు. ఆదివారం వరకు గడువున్నా శనివారమే బీఫారాలు సమర్పించాలి. ఈ పదిరోజులూ 24 గంటలూ కష్టపడాలి.

- కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి వందకు పైగా స్థానాలను గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. గత ఎన్నికల్లో ఒక్క బాల్‌తో సెంచరీ తప్పిపోయిందని.. జాంబాగ్‌లో 5 ఓట్లతో ఓడిపోయామని చెప్పారు. ఈసారి దాన్ని తప్పకుండా సాధిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి సామాజిక న్యాయాన్ని పాటించామని చెప్పారు. ఇది అందరి హైదరాబాద్‌.. అందరి కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. హైదరాబాద్‌ బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని, అన్నారు. హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ‘‘బతుకుతెరువు కోసం వచ్చినవారంతా మా బిడ్డలే’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారని, తాను కూడా హైదరాబాద్‌లో పుట్టలేదని సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డామని అన్నారు. హైదరాబాద్‌ ప్రగతి నివేదికే తెరాస అభ్యర్థులకు ప్రచారాస్త్రమని, ఆరున్నరేళ్లలో సాధించిన అభివృద్ధిని తెలియజెప్పి ఓట్లు అడగాలని అభ్యర్థులకు సూచించారు. మోటారు వాహనాల చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమే అయినా ఇక్కడి తెలంగాణ నేతలు మాత్రం పోలీసు చలాన్లను జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుందని చెప్పడం దారుణమన్నారు. నగరంలో ఎన్నో గుడులుండగా బండి సంజయ్‌ వాటిని వదిలి హిందూ-ముస్లిం గొడవలు, ఇండియా- పాకిస్థాన్‌ చిచ్చు కోసమే భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారని ధ్వజమెత్తారు. భాజపాకు దమ్ముంటే హైదరాబాద్‌కు రూ. లక్ష కోట్ల ప్యాకేజీ తేగలదా అని ఆయన ప్రశ్నించారు. 28న ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో ఆయన జీహెచ్‌ఎంసీ అభ్యర్థులు 150 మందితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రగతి నివేదికను విడుదల చేశారు. అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించి బీఫారాలను అందజేశారు.

నేటి నుంచి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం

మంత్రి కేటీఆర్‌ శనివారం నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్‌ అల్లాపుర్‌ చౌరస్తాలో శనివారం సాయంత్రం 5:00 నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. 6 గంటలకు మూసాపేటలో రోడ్‌షో ఉంటుంది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని ఐడీపీఎస్‌ చౌరస్తాలో 7 గంటలకు, సాగర్‌ హోటల్‌ జంక్షన్‌ వద్ద రాత్రి 8 గంటలకు రోడ్‌ షో జరుగుతుంది.  
 

మహిళలకు 85 టికెట్లు ఇచ్చాం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మొత్తం 150 డివిజన్లలో సగం మహిళలకు ఇవ్వాలని చట్టం తెచ్చింది కేసీఆర్‌. వారికి 75 స్థానాలే రిజర్వ్‌ అయినా 85 డివిజన్లలో అభ్యర్థినులను నిలిపి సీఎం మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నారు. ఎస్సీలకు 10 స్థానాలే రిజర్వ్‌ అయినా 13 కేటాయించిన ఘనత తెరాసకే దక్కుతుంది. మైనార్టీలకు 17 స్థానాలు వచ్చాయి. అగ్రవర్ణాల వారికి కూడా న్యాయం చేశాం. తెలంగాణ వచ్చిన కొత్తలో హైదరాబాద్‌లో తెలంగాణేతరులకు ఏమవుతుందో అనే భయాలు ఉండేవి. సీఎం కేసీఆర్‌ వాటిని పటాపంచలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడినవారికి ఈ ఎన్నికల్లో 8 స్థానాలు కేటాయించాం. రాజస్థానీ వాళ్లకు కూడా సీట్లు ఇచ్చాం. నాది కూడా హైదరాబాద్‌ కాదు.. ఇక్కడ పుట్టలేదు స్థిరపడ్డాం.
హైదరాబాద్‌ తెలంగాణ ఆర్థిక ఇంజిన్‌  
తెలంగాణకు ఆర్థిక ఇంజిన్‌ హైదరాబాద్‌. అత్యంత సమర్థుడైన సీఎం కేసీఆర్‌ అద్భుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే రూ. రెండు లక్షల కోట్లు సమీకరించాం. సీఎం కృషి వల్ల నీటి, కరెంట్‌ కష్టాలు తీరాయి. కార్మికులకు ఉపాధితో పారిశ్రామికవాడలు కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌లో ఏడాదిన్నరలో కేశవాపురం రిజర్వాయర్‌ నీళ్లు అందుబాటులోకి వస్తాయి. 2050 వరకు తాగునీటికి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాగు నీటి కష్టాలు తీర్చిన ప్రభుత్వ శ్రమను ప్రజలకు వివరించాలి. నా చిన్నప్పుడు ఎప్పుడూ మతకలహాలు, కర్ఫ్యూలు ఉండేవి. ఆరున్నరేళ్లుగా శాంతి భద్రతల సమస్య లేదు.  
కీలక ఎన్నికలు  
రాష్ట్రానికి ఇవి కీలకమైన ఎన్నికలు. రొటీన్‌గా కొట్లాడొద్దు. ఇంటింటికి వెళ్లాలి. ఎలాంటి హైదరాబాద్‌ కావాలో అంతటా చర్చ పెట్టాలి. కృష్ణంరాజు అనే తెలిసినాయన ఆమధ్య యూపీ వెళితే అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణకు పెట్టుబడులు ఎలా వస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దమ్మున్న సీఎం ఇక్కడ ఉన్నారు కనుకే పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇక్కడ అల్లర్లు జరిగితే రాష్ట్రానికి నష్టం. కరోనా సమయంలో భరోసా ఇచ్చింది మనం. ప్రతిపక్షాలు ఎక్కడున్నాయి? వలస కార్మికుల నుంచి ఛార్జీల రూపంలో కేంద్రం డబ్బులు వసూలు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఉచిత సేవలు అందించింది. వరదలు వచ్చినపుడు మనమే ప్రజల్లో ఉన్నాం. ప్రభుత్వం ఆరున్నర లక్షలమందికి రూ. 650 కోట్ల సాయం అందించింది.

కేంద్రంలో చట్టం తెచ్చి ఇక్కడ చలాన్లు కడతారా?

రాష్ట్రానికి జరిగిన వరద నష్టంపై కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. నెలన్నర దాటినా కేంద్రం మాత్రం పైసా ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటేస్తే రూ. 25 వేలు ఇస్తామంటున్నారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా? ట్రాఫిక్‌ చలాన్లపై భాజపా అధ్యక్షుడు చెబుతున్న మాటలు చూసి నవ్వుకుంటున్నారు జనం. కేంద్రమంత్రి గడ్కరీ తెచ్చిన చట్టం గురించి వారికి తెలియదా? హైదరాబాద్‌లో చలాన్లు కడతామంటున్నారు. అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారం ఇస్తాను అన్నట్లుంది. గుజరాత్‌లో, మధ్యప్రదేశ్‌లో, కర్ణాటకలో చలాన్లు మీరే కడుతున్నారా? ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ ఎన్నికల సభను నిర్వహిస్తున్నాం. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ పెద్దఎత్తున తరలిరావాలి’’ అని కేటీఆర్‌ కోరారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.