close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భాగ్యలక్ష్మి అమ్మ మీద ఆన!

నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు
సీఎం వ్యాఖ్యలు బాధ కలిగించాయి
మజ్లిస్‌తో కుమ్మక్కై భాజపాపై ఆరోపణలు చేస్తున్నారు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌ : వరద సాయాన్ని భాజపా నాయకులే నిలిపేయించారంటూ సీఎం కేసీఆర్‌, తెరాస నాయకులు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచేందుకు మజ్లిస్‌ పార్టీతో తెరాస కుమ్మక్కై తమపై ఆరోపణలు చేస్తోందన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ శుక్రవారం మధ్యాహ్నం ఆయన చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేల సాయాన్ని నిలిపేయాలంటూ భాజపా అధ్యక్షుడు ఎన్నికల సంఘానికి లేఖ రాసినందుకే సాయం ఆగిపోయిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేద్దాం రండి.. అని రెండు రోజుల క్రితం సవాల్‌ చేసినా ఆయన రాలేదు. నా బాధ్యతగా అమ్మవారి వద్ద ప్రమాణం చేశా. ఇప్పటికైనా కేసీఆర్‌ దిగజారుడు మాటలు ఆపాలి’ అని సంజయ్‌ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.550 కోట్ల వరద సాయం అందించామని, మరో రూ.70 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెరాస చెబుతోందని.. ఇచ్చిన సాయంలో అధికభాగం తెరాస కార్యకర్తలే మింగేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి మాయ మాటలను ప్రజలు ఎంతమాత్రం నమ్మబోరని, గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసను తరిమికొడతారని జోస్యం చెప్పారు. సర్వేలన్నీ భాజపాకు అనుకూలంగా ఉన్నాయన్నారు.
ప్రార్థన వేళ ప్రసంగం ఆపి..
విలేకరులతో మాట్లాడుతున్న బండి సంజయ్‌ ఒక్కసారిగా ప్రసంగం ఆపేశారు. మక్కామసీదులో ప్రార్థనలకు వేళవుతుందని అక్కడున్న పోలీసులు సైగల ద్వారా వివరించడంతో ఆయన సరేనన్నారు. వెళ్లేటప్పుడు మీ సహకారానికి కృతజ్ఞతలంటూ పోలీసులకు నమస్కరించారు. అంతకు ముందు సంజయ్‌ చార్మినార్‌కు వస్తున్నారన్న సమాచారంతో పోలీస్‌లు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి సంజయ్‌ ర్యాలీగా బయలుదేరతారని అనుకున్న పోలీసులు అక్కడే ఉండగా.. ఆయన మాత్రం బంజారాహిల్స్‌ నుంచి నేరుగా పాతబస్తీకి చేరుకున్నారు.
మేయర్‌ పీఠాన్ని అప్పగించండి..అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం..
భాజపాకు మేయర్‌ పీఠాన్ని అప్పగిస్తే..అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని సంజయ్‌ అన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మరిన్ని నిధులు తెప్పిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో కేసీఆర్‌ హైదరాబాద్‌ను డల్లాస్‌, ఇస్తాంబుల్‌ నగరాలను తలపించేలా చేస్తామన్నారని, ప్రస్తుతం మనమంతా గుంతల రోడ్లపై ప్రయాణం చేస్తున్నామని ఎద్దేవా చేశారు. తాము గెలిస్తే వరద బాధితులకు ప్రతి ఇంటికి రూ.25వేల చొప్పున కచ్చితంగా ఇస్తామని చెప్పారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.