close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీఎస్‌-బీపాస్‌లో మరిన్ని సేవలు!

 త్వరలో భవనాల విస్తరణ, లేఅవుట్లకూ వర్తింపు


ఈనాడు - హైదరాబాద్‌

దేశంలోనే వినూత్నంగా తెలంగాణలో అమలు చేస్తున్న టీఎస్‌-బీపాస్‌లో మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం టీఎస్‌-బీపాస్‌ విధానంలో 600 చదరపు గజాల్లోపు నివాసాలకు స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసిన వెంటనే భవన నిర్మాణ అనుమతి లభిస్తోంది. రెండు నెలలక్రితం రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ 4,000కు పైగా అనుమతులు జారీ అయ్యాయి. త్వరలో అదనపు ఫ్లోర్‌ల నిర్మాణం, భవన విస్తరణ వంటివాటికి కూడా దీని ద్వారా అనుమతులు లభించనున్నాయి. అలాగే కొత్త లేఅవుట్‌లకు కూడా అనుమతులు జారీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 ఎన్‌ఓసీల కోసం చేజింగ్‌ సెల్‌
టీఎస్‌-బీపాస్‌ కింద భవనాలకు గరిష్ఠంగా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి ఇవ్వాల్సి ఉంది. 600 చదరపు గజాలకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన భవనాలు, వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులకు ఇతర శాఖల నుంచి అవసరమైన నిరభ్యంతర పత్రాలను (ఎన్‌ఓసీలను) పురపాలక శాఖే తెప్పించుకుంటుంది. ఇందుకోసం టీఎస్‌-బీపాస్‌ కార్యాలయంలో చేజింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. ఈ సెల్‌ వివిధ శాఖలకు దరఖాస్తులను పంపి నిరభ్యంతర పత్రాలను తెప్పిస్తోంది. ఇప్పటి వరకూ ఈ విధానంలో 25 దరఖాస్తులు రాగా అవి వివిధ దశల్లో ఉన్నాయి. కొత్త విధానం వచ్చాక దరఖాస్తుదారు అనుమతుల కోసం వేర్వేరు కార్యాలయాలకు చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పిపోయింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీలు
స్వీయ ధ్రువీకరణలో అనుమతులు పొందాక ఎవరైనా అందుకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే వాటిని ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయడమే కాకుండా క్రిమినల్‌ చర్యలను తీసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్‌/జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఈ కమిటీలు ఏర్పాటవుతాయి. ఇవి క్షేత్రస్థాయిలో భవన నిర్మాణ అనుమతుల ఉల్లంఘన, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి గుర్తించి చర్యలు తీసుకుంటుంది. భవన నిర్మాణ నిబంధనలు, జోనింగ్‌ నిబంధనలు, మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం భూ వినియోగ నిబంధనల వంటివి పాటించారో లేదో తనిఖీ చేసి వాటికి విరుద్ధంగా ఆమోదం పొందితే ఆ అనుమతుల్ని రద్దు చేస్తారు.
సరికొత్త అంశాలు
* ఒకవేళ భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలను గుర్తించి అనుమతిని రద్దు చేస్తే, అప్పటికే దరఖాస్తుదారు చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
* భవన నిర్మాణ అనుమతులకు ఎంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందనే వివరాలను దరఖాస్తుదారులే స్వయంగా తెలుసుకునేలా ఫీజు క్యాలికులేటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు