అమ్మకానికి హౌసింగ్‌బోర్డు భూములు!
close

ప్రధానాంశాలు

అమ్మకానికి హౌసింగ్‌బోర్డు భూములు!

రూ.2,379 కోట్ల విలువైన 123.12 ఎకరాల గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆర్థిక వనరుల సమీకరణ కోసం హౌసింగ్‌బోర్డు రాష్ట్రవ్యాప్తంగా తనకున్న స్థిరాస్తుల్లో విలువైన భూముల జాబితాను రూపొందించింది. హైదరాబాద్‌, నగర శివారులో ఉన్న ఆరు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూములను అధికారులు గుర్తించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూముల్ని విక్రయించాలని నిర్ణయించిన నేపథ్యంలో హౌసింగ్‌బోర్డు అధికారులు విలువైనవి, ఆక్రమణలకు ఆస్కారం ఉన్నవాటిని గుర్తించారు. మార్కెట్‌లో వాటి విలువను అంచనా వేశారు. ఆరు ప్రాంతాల్లో 24 చోట్ల 123.12 ఎకరాలను గుర్తించి, విలువను రూ.2,379.48 కోట్లుగా అధికారులు లెక్కగట్టారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఘట్‌కేసర్‌, కుత్బుల్లాపూర్‌ మండలాల పరిధిలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో హౌసింగ్‌బోర్డుకు భూములున్నాయి. కూకట్‌పల్లిలో ఒకేచోట 26.24 ఎకరాలు ఉంది. దీని విలువను రూ.798 కోట్లుగా అధికారులు తేల్చారు. కూకట్‌పల్లి మండల పరిధిలో కైత్లాపూర్‌లో 11 చోట్ల, కూకట్‌పల్లి గ్రామపరిధిలో రెండుచోట్ల, గచ్చిబౌలిలో ఒకచోట, కుత్బుల్లాపూర్‌ మండలం చింతల్‌లో ఒకచోట, ఘట్‌కేసర్‌ మండలం పోచారంలో తొమ్మిదిచోట్ల హౌసింగ్‌బోర్డుకు భూములున్నాయి. వీటిలో దాదాపు 38 ఎకరాలకు సంబంధించి వివాదాలున్నాయి. హౌసింగ్‌బోర్డు పలుచోట్ల అనేక రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులను గతంలో చేపట్టి పూర్తిచేసింది. కొన్నిచోట్ల మాత్రం గిరాకీ లేకపోవడంతో నిలిపివేసింది. కూకట్‌పల్లిలో 2009లో 200 ఎంఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రాజెక్టు చేపట్టగా స్పందన రాలేదు. దాంతో అక్కడ ఖాళీగా ఉన్న 6.27 ఎకరాల్ని ఇప్పుడు విక్రయించాలని నిర్ణయించింది. అదేవిధంగా పోచారంలో రెండుచోట్ల ఎల్‌ఐజీ బ్లాక్‌ల ప్రాజెక్టుల్ని గతంలో నిలిపివేయగా, ఇప్పుడా భూముల్ని విక్రయించేవాటి జాబితాలో చేర్చింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని