వైద్యుల్లో సమయపాలన ఎలా?
close

ప్రధానాంశాలు

వైద్యుల్లో సమయపాలన ఎలా?

సాయంత్రపు వేళ ఓపీ నిర్వహణపై దృష్టి
ఆరోగ్యశాఖలో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు బోధనాసుపత్రుల దాకా అన్ని స్థాయుల్లోనూ వైద్యుల సమయ పాలనను గాడిలో పెట్టడంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ఆలస్యంగా రావడం, చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరీ వంటి చర్యల వల్ల ప్రభుత్వ వైద్యులపై ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడిందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల మంత్రివర్గ ఉపసంఘ భేటీలోనూ ఆ అంశం చర్చకొచ్చినట్లు తెలిసింది. ఈ పరిస్థితులను చక్కదిద్దాలని వైద్యశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సుమారు 2,500-3,000 మంది స్పెషలిస్టు వైద్యులు సమయపాలన పాటిస్తే.. సర్కారు వైద్యంలోనే అద్భుతాలు సృష్టించవచ్చని వైద్యశాఖ భావిస్తోంది. నిమ్స్‌ తరహాలో సర్కారు ఆసుపత్రుల్లోనూ సాయంత్రపు వేళ ఓపీ సేవలు నిర్వహించాలనే అంశం కూడా ఇటీవల చర్చకొచ్చింది. తమిళనాడులో ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసు ఉండదని, అదే విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరిగినట్లు వైద్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నెలాఖరులో తమిళనాడు, కేరళలో పర్యటించిన అనంతరం అక్కడి ఉత్తమ సేవలను ఇక్కడ కూడా అమలు చేయడంపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తారని, అనంతరం సీఎం అనుమతితో స్పెషలిస్టు వైద్యుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంపై నిర్ణయం తీసుకుంటారని ఆ ఉన్నతాధికారి పేర్కొన్నారు.


మౌలిక సదుపాయాల అభివృద్ధి

* వచ్చే రెండేళ్లలో వైద్యఆరోగ్యశాఖకు బడ్జెట్‌ నిధులతో సంబంధం లేకుండా రూ.10 వేల కోట్లు కేటాయించనుండడంతో..ఆ నిధుల ఖర్చుపై చర్చించారు.
* వరంగల్‌లో 24అంతస్తులతో అధునాతన వైద్య భవనాన్ని నిర్మించడానికి సుమారు రూ.1000కోట్ల ఖర్చవుతుందని అంచనా వేయగా.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు ప్రభుత్వ వైద్యకళాశాలల నిర్మాణానికి నిధులపై మాట్లాడారు.
* అన్ని జిల్లాల్లోనూ అధునాతన ప్రయోగశాలలు, రక్తశుద్ధి కేంద్రాల పెంపు, జిల్లా ఆసుపత్రులో క్యాన్సర్‌ చికిత్సలు తదితర అంశాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు.
* తమిళనాడు తరహాలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇందులో పనిచేసే వారు విధిగా ప్రజారోగ్య వైద్యవిద్యను అభ్యసించాలనే నిబంధనను అమలు చేయాలనే కోణంలోనూ చర్చించారు.
* కాన్పుల్లో కోతలను అరికట్టడానికి వైద్యసిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
* ఆసుపత్రుల్లో మరణాలు ఏ కారణంతో జరుగుతున్నాయనే విశ్లేషణ కచ్చితంగా నిర్వహించాలి. ప్రతి మరణంపై సమాచారం పొందుపర్చాలనుకున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని