వరంగల్‌లో వైటెక్స్‌
close

ప్రధానాంశాలు

వరంగల్‌లో వైటెక్స్‌

హైటెక్స్‌ తరహా అంతర్జాతీయ సమావేశ మందిరం, ప్రదర్శన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హైటెక్స్‌ తరహాలో తెలంగాణలోని రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో అంతర్జాతీయ సమావేశ మందిరం, వాణిజ్య ప్రదర్శన కేంద్రం (వైటెక్స్‌)ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌ మడికొండలోని ఐటీ పార్కు వద్ద ప్రతిష్ఠాత్మక రీతిలో దీనికి రూపకల్పన చేయాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)ని ఆదేశించింది. దీనికి అనుబంధంగా త్రీస్టార్‌ హోటల్‌ను నిర్మించనున్నారు. హైటెక్స్‌ తరహాలోనే దీనిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ), నమూనా అభ్యర్థన ప్రతిపాదన (ఆర్‌ఎఫ్‌పీ) తరహాలో చేపట్టాలని సూచించింది. పది నుంచి ఇరవై ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీనికి వైటెక్స్‌ (వరంగల్‌ అంతర్జాతీయ సమావేశ మందిర, వాణిజ్య ప్రదర్శనల సంస్థ) పేరును ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని నిర్మాణానికి ప్రాథమికంగా రూ.25 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 1998లో హైదరాబాద్‌ మాదాపూర్‌లో 100 ఎకరాల్లో నిర్మించిన హైటెక్స్‌ తెలంగాణకు తలమానికంగా ఉంది. ఇందులోని హైదరాబాద్‌ అంతర్జాతీయ సమావేశ కేంద్రం (హెచ్‌ఐసీసీ)లో ఏటా వెయ్యికి పైగా సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు ఇది వేదికగా నిలుస్తోంది. హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద మహానగరమైన వరంగల్‌ అదే స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. 2016లో మడికొండలో ఈ ఐటీ పార్కు ప్రారంభమైంది. టెక్‌మహీంద్రా, సైయింటు తదితర ప్రముఖ కంపెనీలు అందులో ప్రాంగణాలను ఏర్పాటుచేశాయి. ఉత్తర దక్షిణ భారతాలను అనుసంధానించే ఖాజీపేట రైల్వే జంక్షన్‌, జాతీయ రహదారులు ఇక్కడ ఉండడంతో వరంగల్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్‌ఐటీ) ఇక్కడ ఉంది. మూతపడ్డ మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటన్నిటికీ మించి హైదరాబాద్‌కు రెండు గంటల్లో చేరుకోవచ్చు. ఈ కారణాలతో ఇక్కడ వైటెక్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది.

వరంగల్ల్‌ో కూడా అంతర్జాతీయ సమావేశమందిరం, ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేయాలని తెరాస ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఇతర ప్రజాప్రతినిధులు కూడా దీనిపై విజ్ఞప్తిచేశారు. కేటీఆర్‌ చొరవ తీసుకొని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన అనంతరం ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దీనికి ఆమోదం తెలిపారు. మడికొండ ఐటీ పార్కు వద్ద టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ శుక్రవారం దీనిపై టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై త్వరలో మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, నమూనా ఇతర అంశాలపై చర్చించి, తుది ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఈ నెల 21న వరంగల్‌ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని