తమిళనాట నరమాంస భక్షకుల కలకలం

ప్రధానాంశాలు

తమిళనాట నరమాంస భక్షకుల కలకలం

  కుళ్లిన పుర్రెతో ఆలయ ఉత్సవాల్లో  సామియాదీల నృత్యం

  10 మందిపై కేసు నమోదు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాడులో నరమాంస భక్షకులు కలకలం రేపారు. అందరి ముందు నరమాంసం తింటూ ఊగిపోయారు. పుర్రెను చేతిలో పట్టుకుని పాటలు పాడుతూ వికృతంగా నృత్యాలు చేశారు. తెన్కాశి జిల్లా పావూర్‌సత్రం సమీప కల్లూరణి గ్రామంలో ఇటీవల జరిగిన ఆలయ ఉత్సవాల్లో సామియాదీలు (ఆలయ పూజారులు. స్వామి ముందు ఆడతారు కాబట్టి స్వామి ఆడి.. అదే సామియాది అయ్యిందని స్థానికులు చెబుతున్నారు) కుళ్లిన పుర్రెతో నాట్యం చేశారు. ఈ దృశ్యాలు మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోలీసులు సామియాదీలు, ఆలయ కమిటీ సభ్యులు సహా 10 మందిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కల్లూరణిలో శక్తిపోతి మాడస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా తమిళ ఆషాఢమాసం మొదటి శుక్రవారం నుంచి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 24న అవి ప్రారంభమయ్యాయి. మాడస్వామి ఎదుట నృత్యం చేసే ఈ పూజారులు... శ్మశానవాటికలోని మృతదేహం తలను నరికి, ఆలయానికి తీసుకొచ్చి ఉత్సవం పూర్తి చేస్తారని తెలిసింది. కుళ్లిన పుర్రె మనిషిదా? లేక నకిలీదా? అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2019లోనూ కొందరు మనిషి పుర్రెను తీసుకొచ్చి ఇలాగే ప్రదర్శించారని, అప్పట్లోనూ దానిపై కేసు నమోదైందని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని