పాలిసెట్‌లో 81.75 శాతం ఉత్తీర్ణత

ప్రధానాంశాలు

పాలిసెట్‌లో 81.75 శాతం ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్వహించిన పాలిసెట్‌లో 81.75 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రవేశ పరీక్షకు మొత్తం 92,557 మంది హాజరుకాగా వారిలో 75,666 మంది కనీస మార్కులు పొంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్‌) కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, పాలిసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ తదితరులు ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన 53,371 మంది బాలురిలో 42,595 మంది(79.81 శాతం), 39,186 మంది బాలికల్లో 33,071 మంది   (84.39 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ, బైపీసీ విభాగంలో పరీక్షలు జరగగా.. వేర్వేరు ర్యాంకులు ఇచ్చారు. ఎంపీసీలో అబ్దుల్‌ రహమాన్‌(నిజామాబాద్‌) 120 మార్కులకు 118 పొంది మొదటి ర్యాంకు దక్కించుకున్నారు. బైపీసీలో కాలకుంట్ల రిషిక(సిద్దిపేట) 117 మార్కులతో తొలి ర్యాంకు సాధించారు. ర్యాంకుల విడుదల అనంతరం నవీన్‌ మిత్తల్‌ మాట్లాడుతూ.. బాసర ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌తోపాటు పీవీ నరసింహారావు వెటర్నరీ, అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయం అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఆయా విశ్వవిద్యాలయాలు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తాయన్నారు. పీవీ నరసింహారావు వర్సిటీ ఈ విద్యాసంవత్సరం తెలుగు మాధ్యమంలో పశు సంవర్ధక, మత్స్య పాలిటెక్నిక్‌ కోర్సులను అందించనుందని చెప్పారు. కార్యక్రమంలో సంయుక్త సంచాలకుడు పుల్లయ్య, పరీక్షల విభాగం కంట్రోలర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వారంలో ఆర్‌జీయూకేటీ నోటిఫికేషన్‌!

ఆగస్టు 5వ తేదీ నుంచి పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ జరుగనుంది. ఆర్‌జీయూకేటీ కౌన్సెలింగ్‌ను కూడా దానితోపాటే నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలిటెక్నిక్‌ తొలి కౌన్సెలింగ్‌ ముగిసిన వెంటనే ఆర్‌జీయూకేటీ కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని, అప్పుడు వాటిలో సీటు రాని విద్యార్థులు పాలిటెక్నిక్‌ రెండో కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అవకాశముంటుందని భావిస్తున్నారు. వారం రోజుల్లో ఆర్‌జీయూకేటీ నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు సమాచారం.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని