ఉత్తమ ఉత్పత్తులను మేమే కొంటాం

ప్రధానాంశాలు

ఉత్తమ ఉత్పత్తులను మేమే కొంటాం

ప్రభుత్వమే తొలి వినియోగదారు

యువ మహిళా పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని అంకుర సంస్థలు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో రాష్ట్రానికి, దేశానికి దిశా నిర్దేశం చేస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని, వారిని అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. వారి ఉత్తమ ఉత్పత్తులకు ప్రభుత్వమే తొలి వినియోగదారుగా ఉంటుందని, వాటి మార్కెటింగ్‌కు సాయం అందిస్తుందని చెప్పారు. అంకురాలు నెలకొల్పిన యువ మహిళా పారిశ్రామికవేత్తల గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌ వీహబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 47 మంది అంకుర పారిశ్రామికవేత్తలు రూపొందించిన ఉత్పత్తులను కేటీఆర్‌ పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

‘‘తెలంగాణలో ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో మహిళలకు గొప్ప అవకాశాలు కల్పించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం ఏర్పాటు చేశాం. విస్తృతంగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఔత్సాహిక మహిళలు అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని పురోగమించాలి. త్వరలోనే అయిదేసి పాఠశాలలు, కళాశాలల్లో వీహబ్‌ ఆధ్వర్యంలో అంకుర పరిశ్రమలపై శిక్షణ నిర్వహించబోతున్నాం’’ అని కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీహబ్‌ కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఫిక్కి ద్వారా మార్గనిర్దేశం, వ్యాపారాభివృద్ధి సహకారం, 100 మందిని తీర్చిదిద్దడం, దేశవ్యాప్తంగా 20 అంకురాలను ఏర్పాటు చేయడం ఇందులో ఉన్నాయి. స్టీమ్‌, అల్ఫా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వీహబ్‌ సీఈవో రావుల దీప్తి తెలిపారు.

రాష్ట్రంలో తైవాన్‌ పారిశ్రామిక పార్కు: కేటీఆర్‌

రాష్ట్రంలో తైవాన్‌ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ప్రారంభించేందుకు వేయి ఎకరాల్లో ప్రత్యేక పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సొంతంగా గానీ, ఉమ్మడి భాగస్వామ్యంతోగానీ దానిని చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. తైవాన్‌ ఆర్థిక, సాంస్కృతిక సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బెన్‌వాంగ్‌ నేతృత్వంలో అక్కడి విదేశీ వాణిజ్య అభివృద్ధి మండలి, భారత్‌ పెట్టుబడుల సంస్థ ప్రతినిధుల బృందం బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రితో భేటీ అయింది. మంత్రి వారికి తెలంగాణ పారిశ్రామిక విధానం, రాయితీలు, ప్రోత్సాహకాలు, భూబ్యాంకు, మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత వంటి అంశాలను వివరించారు.

వైమానిక ప్రదర్శనను విజయవంతం చేస్తాం

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో వచ్చే ఏడాది మార్చి 24 నుంచి 27 వరకు జరిగే అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన (వింగ్స్‌ ఇండియా)ను విజయవంతం చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి మార్చి 31 వరకు దుబాయ్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామిక ప్రదర్శనలో తెలంగాణ స్టాల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనివారం భారత పరిశ్రమలు, వాణిజ్యమండళ్ల సమాఖ్య (ఫిక్కి) ప్రధాన కార్యదర్శి దిలీప్‌చెనాయ్‌, రాష్ట్ర సహఛైర్మన్‌ మురళీకృష్ణారెడ్డిలు కేటీఆర్‌ను కలిశారు. దుబాయ్‌ పారిశ్రామిక ప్రదర్శన, హైదరాబాద్‌లో వైమానిక ప్రదర్శనల గురించి చర్చించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని