రామప్ప గుర్తింపును నిలబెట్టుకుందాం

ప్రధానాంశాలు

రామప్ప గుర్తింపును నిలబెట్టుకుందాం

యునెస్కో షరతులు గడువులోగా పూర్తి చేయాలి

కేంద్ర, రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయండి

మొత్తం వ్యవహారాన్ని మేమే పర్యవేక్షిస్తాం: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచస్థాయి కట్టడంగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవాలని హైకోర్టు స్పష్టంచేసింది. ఇదో సువర్ణ అవకాశమని.. ప్రభుత్వానికే కాకుండా అందరికీ గర్వకారణమంది. యునెస్కో విధించిన షరతులను డిసెంబరులోగా పూర్తి చేయాలంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నోడల్‌ అధికారిగా హైదరాబాద్‌లోని కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ వ్యవహరించాలంది. ఈ కమిటీ ఆగస్టు 4న మొదటి సమావేశం నిర్వహించాలంది. సంయుక్త సర్వే నిర్వహించడంతోపాటు ఆలయ అభివృద్ధికి సంబంధించి పూర్తిస్థాయి బ్లూప్రింట్‌ తయారయ్యేదాకా ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. స్థాయీ నివేదికల్లో సాధించిన అంశాలను పేర్కొనాలంది. మొత్తం వ్యవహారాన్ని తామే పర్యవేక్షిస్తామని హైకోర్టు పేర్కొంది. రామప్ప ఆలయానికి దక్కిన గుర్తింపును నిలబెట్టుకోవాలంటే యునెస్కో షరతులను పూర్తి చేయాల్సి ఉంటుందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ‘‘రామప్ప ఆలయానికి దక్కిన గుర్తింపును శాశ్వత చేసుకునేందుకు నిర్దిష్ట గడువులోగా సమగ్ర పరిరక్షణ, నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి. ప్రపంచ వారసత్వ గుర్తింపులను పర్యవేక్షించే అంతర్జాతీయ స్మారక చిహ్నాలు, స్థలాల మండలి (ఐకామోస్‌) ఈ ఆలయాన్ని తన సంరక్షణలోకి తీసుకోవాలంటే ఈ ప్రణాళికను డిసెంబరులోగా సమర్పించాల్సి ఉంది. భౌగోళికంగా విస్తరించడంతోపాటు విపత్తుల సమయంలో రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. బఫర్‌ జోన్‌లోని కాకతీయుల కాలంనాటి చిన్న చిన్న ఆలయాలనూ దీని పరిధిలోకి తీసుకురావాలి. వీటన్నింటి పరిరక్షణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను డిసెంబరులోగా సమర్పించాలి. ఇందులో కేంద్ర పురావస్తు శాఖ కీలక పాత్ర పోషించాలి. దీనిపై నాలుగు వారాల్లో స్థాయీ నివేదికను సమర్పించాలి’’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

గోల్కొండ పరిరక్షణపై నివేదిక సమర్పించడానికి గడువు

చారిత్రక కట్టడాలైన గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌తోపాటు మరో 25 కట్టడాలను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించిందని.. నివేదిక సమర్పించడానికి గడువు కావాలని హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కుతుబ్‌షాహీ టూంబ్స్‌, గోల్కొండ కోటల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా, కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్‌, రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ఆగాఖాన్‌ ఫౌండేషన్‌కు చెందిన సీనియర్‌ అధికారి, జేఎన్‌టీయూ ఆర్కిటెక్చర్‌, విద్యుత్‌ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్‌ బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కమిటీ గోల్కొండ కోటతోపాటు మిగిలిన చారిత్రక కట్టడాలను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించిందన్నారు. పలువురి నుంచి సూచనలు, వినతులు అందాయని.. వాటిని పరిశీలించి నివేదిక సమర్పించడానికి గడువు కావాలని కోరారు. ధర్మాసనం అందుకు అనుమతిస్తూ విచారణను సెప్టెంబరు 22వ తేదీకి వాయిదా వేసింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని