అయిదు టీఎంసీల నిల్వతో సమస్యలేదు

ప్రధానాంశాలు

అయిదు టీఎంసీల నిల్వతో సమస్యలేదు

మల్లన్నసాగర్‌లో ప్రయోగాత్మకంగా మరో 5 టీఎంసీల నీటిని నింపవచ్చు

పరిశీలన అనంతరం నిపుణుల కమిటీ వెల్లడి

ఈనాడు హైదరాబాద్‌: మల్లన్నసాగర్‌లో అయిదు టీఎంసీల నీటి నిల్వ వల్ల ఎలాంటి సమస్య లేదని, మట్టి కట్ట పటిష్ఠంగా ఉందని నిపుణుల కమిటీ పేర్కొంది. ప్రయోగాత్మకంగా మరో అయిదు టీఎంసీల నీటిని నింపవచ్చంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్‌లో తొలుత అయిదు టీఎంసీలు నిల్వ చేసి పరీక్షించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 4.9 టీఎంసీలు నిల్వ చేశారు. దీని తర్వాత రిజర్వాయర్‌ కట్ట ఎలా ఉంది? పటిష్ఠత  సహా దాని స్వభావాన్నీ పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న సీపేజి పరిమితంగానే ఉందని, ఉండాల్సినంతే ఉందని కూడా కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రిజర్వాయర్‌ ప్రారంభోత్సవంతో పాటు తదుపరి నీటి నిల్వను క్రమంగా పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. రిజర్వాయర్‌ డిజైన్స్‌, భూగర్భ శాస్త్రవేత్తలు ఇచ్చిన నివేదికలు, నిర్మాణ సమయంలో అనుసరించిన సాంకేతిక పద్ధతులు ఇలా అన్నింటినీ పరిశీలించడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఉస్మానియా, ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు శ్రీధర్‌, ఉమాశంకర్‌, శశిధర్‌, కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ హరిరాం రెండు రోజుల క్రితం మల్లన్నసాగర్‌ను పరిశీలించారు. ఈ రిజర్వాయర్‌కు పూర్తిగా మట్టికట్ట కావడంతో పాటు 20 మీటర్ల నుంచి 60 మీటర్ల వరకు ఎత్తు ఉంది. జలాశయాన్ని పరిశీలించాకే తొలుత 4.9 టీఎంసీలు నింపగా తాజాగా (ఈ నెల 16న) కట్టలో భాగమైన ఇసుక, మెటల్‌ ఫిల్టర్లు, రాతికట్టడం, డ్రెయిన్స్‌ అన్నింటినీ పరిశీలించారు. మరో ఐదు టీఎంసీలను నింపితే పది టీఎంసీల కనీస నీటిమట్టానికి చేరుతుంది. అనంతరం నెలరోజులు పరిశీలించి మళ్లీ కొంత నీటిని నింపుతారు. ఇలా దశలవారీగా నిల్వను పెంచుకుంటూ పోతామని సంబంధిత వర్గాలు తెలిపాయి. చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌, ప్రాజెక్టు ఎస్‌.ఇ వేణు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు నిపుణుల కమిటీకి అవసరమైన వివరాలు అందజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని