రవిప్రసాద్‌ను నేను సిఫార్సు చేయలేదు

ప్రధానాంశాలు

రవిప్రసాద్‌ను నేను సిఫార్సు చేయలేదు

తితిదే ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

విచారణ జరిపించాలని ఏపీ సీఎం జగన్‌కు లేఖ

ఈనాడు- అమరావతి, తిరుపతి: తితిదే బోర్డు సభ్యులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల నియామకం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వై.రవిప్రసాద్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సిఫార్సుతోనే ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారని సామాజిక మాధ్యమాల్లో శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే రవిప్రసాద్‌ను తాను వ్యక్తిగతంగా కానీ, తన శాఖ తరఫున కానీ సిఫార్సు చేయలేదని స్పష్టం చేస్తూ కిషన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. మీరు ఈ విషయంలో వ్యక్తిగతంగా కలగజేసుకుని ఈ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. నల్గొండ జిల్లాకు చెందిన వై.రవిప్రసాద్‌ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు నిర్మాణ, స్థిరాస్తి, ట్రేడింగ్‌, హోటళ్లు, రెస్టారెంట్‌ వ్యాపారాలున్నాయి. గాయత్రీ వైష్ణోయ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, శ్రీ వైష్ణోయ్‌ ప్రాజెక్టులతోపాటు 20కిపైగా సంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

రాజకీయ పార్టీల సిఫార్సులు చేస్తే చాలు... ఎలాంటి విచారణ లేకుండానే సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను నియమించారన్న ఆరోపణలు ఈ ఉదంతంతో మరోమారు చర్చకు వచ్చాయి. అయితే వైకాపా నేతలు మాత్రం ‘స్వామివారికి సేవ చేసుకుంటామని కోరిన వారికే ముఖ్యమంత్రి అవకాశమిచ్చారు’ అని  చెబుతున్నారు. వారి చరిత్ర ఏమిటి? బోర్డు సభ్యులుగా లేదా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యే అర్హత వారికి ఉందా అనే విషయాలపై లోతైన పరిశీలన చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌ను కొత్త బోర్డులోనూ సభ్యుడిగా కొనసాగించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులైన తమిళనాడుకు చెందిన ఒకరిపై కేసులున్నాయి. మహారాష్ట్ర నుంచి నియమితులైన ఓ సభ్యుడిపైనా సీబీఐ కేసు ఉన్నట్లు  తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని