న్యాయవ్యవస్థకు భారతీయతను అద్దాలి

ప్రధానాంశాలు

న్యాయవ్యవస్థకు భారతీయతను అద్దాలి

వలస పాలన నాటి చట్టాలు నేటి అవసరాలకు సరిపోవడం లేదు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు- దిల్లీ, బెంగళూరు (మల్లేశ్వరం)- న్యూస్‌టుడే

దేశీయ న్యాయవ్యవస్థ వలసవాద వాసనలను వీడి భారతీయతను సంతరించుకోవాలని, అది ఇప్పుడు అత్యవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. బ్రిటిష్‌ కాలంలో రూపుదిద్దుకున్న చట్టాలు, నిబంధనలు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని, అందువల్ల ఇందులో మార్పులు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి మోహన శాంతనగౌడర్‌ సంస్మరణార్థం కర్ణాటక న్యాయవాదుల పరిషత్తు ఆధ్వర్యంలో బెంగళూరు విధానసౌధలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాల్గొని మాట్లాడారు. ‘మనం ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా, గతాన్ని మరచిపోకూడదు’ అని జస్టిస్‌ గౌడర్‌ తనకు పలుసార్లు చెప్పేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో దావా వేసిన వారికి మాతృభాషలో, స్థానిక భాషలో తీర్పివ్వాలని ఆయన ఆకాంక్షించారన్నారు. ఆయన ఎప్పుడూ సర్వస్వతంత్రంగా తీర్పులు ఇచ్చార]ని పేర్కొన్నారు. 

మన అవసరాలకు తగ్గట్లు మార్చాలి

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ.. మన న్యాయవ్యవస్థ సామాన్య ప్రజలకు తరచూ బహుళ అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. ‘మన వ్యవస్థలు, సంప్రదాయాలు, నిబంధనలు వలస పాలనలో పుట్టుకొచ్చినందున ప్రస్తుత భారతీయ ప్రజల అవసరాలకు అవి సరిపోకపోవచ్చు. మన న్యాయస్థానాల శైలి, పనితీరు కూడా భారతీయ సంక్లిష్టతలకు చాలడం లేదు. అందువల్ల దేశీయ న్యాయవ్యవస్థను భారతీయ అవసరాలకు తగ్గట్టు మార్చడం తక్షణావసరం. ఉదాహరణకు కుటుంబగొడవల్లో ఉన్న గ్రామీణులు తమ వివాదాన్ని న్యాయస్థానాల బయటే పరిష్కరించుకోవాలని భావిస్తుంటారు. కోర్టుల్లో పరాయిభాష ఆంగ్లంలో జరిగే వాదనలు వారికి అర్థం కావు. ఈ రోజుల్లో సుదీర్ఘంగా సాగుతున్న విచారణలు కక్షిదారుల పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. సామాన్యుడు న్యాయం కోరి వచ్చేటప్పుడు న్యాయమూర్తులు, కోర్టులను చూసి భయపడే పరిస్థితి రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక అయిన మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి. అమెరికా సంయుక్త రాష్ట్రాల మాజీ ప్రధాన న్యాయమూర్తి వారెన్‌ బర్గర్‌ చెప్పినట్లు సమస్యలు, బాధల్లో ఉన్న కక్షిదారులు తమకు తక్కువ ఖర్చుతో, సాధ్యమైనంత వేగంగా పరిష్కారాలు లభించాలని మాత్రమే కోరుకుంటారు తప్ప మంచి కోర్టు గదుల్లో నల్లకోటు వేసుకున్న న్యాయమూర్తులు, మంచి వస్త్రాలు ధరించిన న్యాయవాదులు ఉండాలని కోరుకోరు’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.

ఆ ఉంగరం చూసినప్పుడల్లా గౌడర్‌ గుర్తొస్తారు..

జస్టిస్‌ శాంతనగౌడర్‌, తాను ఎక్కువగా ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకునే వారమని చెబుతూ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ భావోద్వేగానికి గురయ్యారు. జ్ఞానపీఠ కవి డి.వి.గుండప్ప ‘హుల్లాలు బెట్టదడి’ పుస్తకంలోని ఒక కవితలో కొన్ని వరుసలను చదివి గౌడర్‌ను స్మరించుకున్నారు. ‘మేమిద్దరం ఏడాదిన్నరపాటు ఒకే ధర్మాసనంలో ఉన్నాం. ఒకరోజు కోర్టు సమయం పూర్తయి ఇద్దరం ఛాంబర్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాం. ఆ సమయంలో నేను న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత సత్యసాయిబాబా ఇచ్చిన ఉంగరంలోని పచ్చరాయి పడిపోయిందని గుర్తించాను. ఆ విషయం చెప్పగానే జస్టిస్‌ గౌడర్‌ చాలా బాధపడ్డారు. అరగంట తర్వాత ఆయనే ఆ పచ్చను స్వయంగా వెతికి తెచ్చి నాకిచ్చారు. అది ఆయన దైవానికి, మానవ సంబంధాలకు ఇచ్చే విలువకు అద్దం పడుతుంది. నా వేలికున్న ఆ పచ్చరాయిని చూసినప్పుడల్లా నాకు సత్యసాయిబాబాతోపాటు, జస్టిస్‌ శాంతనగౌడర్‌ కూడా గుర్తొస్తూనే ఉంటారు’ అని అన్నారు. జస్టిస్‌ శాంతనగౌడర్‌ స్మరణార్థం కర్ణాటక న్యాయ వ్యవస్థలో చిరస్థాయిగా నిలిచిపోయే ఏదైనా పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి జస్టిస్‌ రమణ సూచించారు. బసవరాజ బొమ్మై మాట్లాడుతూ సహచర న్యాయమూర్తికి నివాళులు అర్పించడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దిల్లీ నుంచి రావడం మానవ సంబంధాలు, స్నేహానికి ఆయన ఇచ్చే విలువను చాటుతోందన్నారు.

జస్టిస్‌ శాంతనగౌడర్‌ కుమారుడు శివప్రకాశ్‌ మాట్లాడుతూ చివరి దశలో తన తండ్రికి వైద్యం అందించడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ ఎంతో సహాయపడ్డారన్నారు. గత ఏడాదిగా తమ కుటుంబం ఆయన్ను అర్ధరాత్రి అపరాత్రీ అని చూడకుండా ఎంతో ఇబ్బంది పెట్టిందని, కానీ ఆయన ఎప్పుడు ఫోన్‌ చేసినా తక్షణం స్పందించడంతోపాటు, అడుగడుగునా మార్గదర్శనం చేశారని గుర్తుచేసుకున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని