పీఠముడి

ప్రధానాంశాలు

పీఠముడి

ఒకేచోట పలువురు సబ్‌రిజిస్ట్రార్ల తిష్ఠ

ఏళ్లుగా బదిలీలే లేని వైచిత్రి

అనేకమందిపై అవినీతి ఆరోపణలు

రాష్ట్రంలో 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, మెదక్‌ జిల్లాల పరిధిలో పలువురు సబ్‌రిజిస్ట్రార్లు ఐదేళ్లకు పైగా విధుల్లో ఉన్నవారే కావడం గమనార్హం.

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్లకోసారి బదిలీలు సర్వసాధారణం.. రిజిస్ట్రేషన్‌ శాఖకు మాత్రం అది వర్తించదు అన్నట్లుంది పరిస్థితి.. ఈ శాఖలో పలువురు సబ్‌రిజిస్ట్రార్లు తొమ్మిది పదేళ్లు దాటినా ఒకేచోట కొనసాగుతున్నారు. తెలంగాణ ఖజానాకు అత్యధిక రాబడినిచ్చే వాటిలో ఒకటైన రిజిస్ట్రేషన్‌శాఖలో ఏళ్లుగా తిష్ఠవేసిన అధికారులు.. అయితే సబ్‌రిజిస్ట్రార్లుగా లేదంటే ఇన్‌ఛార్జులుగా వ్యవహారం నడిపిస్తున్నారు. కొందరైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచీ బదిలీ మాటే లేకుండా విధులు చక్కబెడుతున్నారు. ఆరోపణలు ఉన్నా.. సస్పెండైనా ఇలాంటివారిలో కొందరి సీట్లకు ఢోకా లేకపోవటం విచిత్రం.

ఏసీబీకి పట్టుబడుతున్న అధికారుల్లో సబ్‌రిజిస్ట్రార్లు ఎక్కువగా ఉంటున్నారు. కొందరైతే 13 ఏళ్లుగా ఒకేచోట వివిధ హోదాల నుంచి రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఒక సబ్‌రిజిస్ట్రార్‌కు అయితే డబ్బులిస్తే దేన్నయినా రిజిస్ట్రేషన్‌ చేస్తారనే పేరుంది. అనుమతిలేని లేఅవుట్‌లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ప్రభుత్వ ఉత్తర్వులున్నా కొందరు వాటిని సైతం ఖాతరు చేయటం లేదు.. నిబంధనల ఉల్లంఘనలో కొందరు దిట్టలైతే.. మరికొందరు వాటికి వక్రభాష్యం చెప్పడంలో ఘనులుగా కనిపిస్తున్నారు.

కదలరు...వదలరు

వరంగల్‌లో ఖిలావరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ 13 ఏళ్లుగా ఒకేచోట ఉన్నారు. ఎనిమిదేళ్లుగా సబ్‌రిజిస్ట్రార్‌గా కొనసాగుతుండగా ఇదే కార్యాలయంలో ఈయన సీనియర్‌ అసిస్టెంట్‌గా ఐదేళ్లు పనిచేశారు. ములుగు సబ్‌రిజిస్ట్రార్‌ పదేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ 2008 నుంచి అక్కడే విధులు నిర్వహిస్తూ రెండేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై వరంగల్‌కు వెళ్లారు. జిల్లా కేంద్రమైన నారాయణపేట సబ్‌రిజిస్ట్రార్‌ 2015 నుంచి, మధిర సబ్‌రిజిస్ట్రార్‌ తొమ్మిదేళ్లుగా, భద్రాచలం సబ్‌రిజిస్ట్రార్‌ ఏడేళ్లుగా, వైరా సబ్‌రిజిస్ట్రార్‌ ఏడున్నరేళ్లుగా ఒకేచోట ఉన్నారు. ఖమ్మంలో మరో ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లు ఎనిమిదేళ్లకు పైగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. చేర్యాల సబ్‌రిజిస్ట్రార్‌ ఎనిమిదేళ్లుగా, సిద్దిపేట గ్రామీణ సబ్‌రిజిస్ట్రార్‌ ఏడేళ్లుగా, తూప్రాన్‌ రిజిస్ట్రార్‌ నాలుగేళ్లుగా బదిలీలకు దూరంగా ఉన్నారు. అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే సంగారెడ్డిలో ఒక సబ్‌రిజిస్ట్రార్‌ నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు.

ఇన్‌ఛార్జీలే దిక్కు...

సబ్రిజిస్ట్రార్ల కొరత నేపథ్యంలో అనేకచోట్ల ఏళ్ల తరబడి సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లు ఇన్‌ఛార్జీలుగా కొనసాగుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువ. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌గా రెండేళ్లుగా ఇన్‌ఛార్జీనే విధుల్లో ఉన్నారు. బోథ్‌, నర్సాపూర్‌ కార్యాలయాల్లోనూ మూడేళ్లుగా అదే పరిస్థితి.. పాత నిజామాబాద్‌ జిల్లా పరిధి ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, భీమ్‌గల్‌, నిజామాబాద్‌ గ్రామీణ సబ్‌రిజిస్ట్రార్లుగా సీనియర్‌ అసిస్టెంట్‌లు ఉన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని మల్యాల, మెట్‌పల్లి కార్యాలయాల్లోనూ అదే  స్థితి. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఇన్‌ఛార్జీగా కొనసాగుతున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని