సమాచారం ఇవ్వాలంటే..ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

ప్రధానాంశాలు

సమాచారం ఇవ్వాలంటే..ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

సహ చట్టం పీఐఓలకు సీఎస్‌ ఉత్తర్వులు

ఇకపై 30 రోజుల్లో సమాచారం

పొందడం అసాధ్యమంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: సమాచార హక్కు(సహ) చట్టం కింద ఇకపై ఎలాంటి సమాచారం ఇవ్వాలన్నా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల ‘ప్రజా సమాచార అధికారుల’ (పీఐఓ)ను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ‘‘ఏదైనా కార్యాలయం నుంచి సమాచారం కోరుతూ ప్రజలెవరైనా దరఖాస్తు చేసేపక్షంలో, ఆ సమాచారాన్ని సదరు దరఖాస్తుదారుడికి ఇవ్వాలా? వద్దా? అనే విషయమై సంబంధిత శాఖ అధిపతిగా ఉండే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలనేది’’ ఈ ఉత్తర్వుల సారాంశం. ప్రస్తుతం కొందరు పీఐఓలు దస్త్రాలు సరిగా పరిశీలించకుండానే వివరాలు ఇస్తున్నారని, దీన్ని నివారించడానికే ఈ మేరకు ఆదేశాలిచ్చామని సదరు ఉత్తర్వుల్లో సీఎస్‌ పేర్కొన్నారు.

చట్టం అమలుపై తీవ్ర ప్రభావం

రాష్ట్రంలో ప్రజలు అడిగిన సమాచారం ఇచ్చేందుకు ఇప్పటికే కొందరు పీఐఓలు నిరాకరిస్తున్నారు. మరికొందరు తీవ్ర కాలయాపన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోరిన సమాచారం ఇవ్వకుండా తమ హక్కును కాలరాస్తున్నారంటూ ప్రతినెలా వందల మంది రాష్ట్ర సమాచార కమిషన్‌కు అప్పీలు/ఫిర్యాదు చేస్తున్నారు. తాజా ఉత్తర్వుతో పీఐఓలలో ఉదాసీనత మరింత పెరుగుతుందని, సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదనే భావనకు అది దారిస్తుందని సహ చట్టం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘సహ చట్టం కింద ప్రజలు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా దరఖాస్తు ఇస్తే, కచ్చితంగా 30 రోజుల్లోగా సమాచారం ఇచ్చి తీరాలి. అయినా పీఐఓలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ఇకపై ప్రభుత్వానికి లేఖ రాసి, అక్కణ్నుంచి సమాధానం వచ్చి తిరిగి దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వడం 30 రోజుల్లో సాధ్యం కాదని’’ సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.

ప్రభుత్వాన్ని చీకటిలో నడుపుతారా?

విశ్రాంత ఐఏఎస్‌ మురళి ప్రశ్న

ప్రజలకు ఎలాంటి సమాచారం చెప్పకుండా ప్రభుత్వాన్ని చీకటిలో నడపాలనేది ఈ ఉత్తర్వుల అర్థమా? అని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి నిలదీశారు. ఈ మేరకు సీఎం కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్‌ను, ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ట్విటర్‌లో ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వ క్రూరమైన చర్యలాంటిదని, సహచట్టం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాసేలా ఉందని ఆయన స్పష్టంచేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని