స్థానిక వస్తువుల్ని ఆదరిద్దాం

ప్రధానాంశాలు

స్థానిక వస్తువుల్ని ఆదరిద్దాం

అప్పుడే పేద కళాకారుల జీవితాలకు వెలుగు  
స్వచ్ఛభారత్‌ ఉత్సాహాన్ని తగ్గనివ్వొద్దు
‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

ఈనాడు-దిల్లీ: పండుగల షాపింగ్‌లో స్థానిక వస్తువుల కొనుగోలుకే ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని కొంటే పేద కళాకారులు, చేనేత కార్మికుల జీవితాల్లోనూ వెలుగులు నిండుతాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఆన్‌లైన్‌ వేదికల నుంచీ స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని, ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికీ చెప్పి ప్రోత్సహించాలని కోరారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దీపావళి సందర్భంగా ఇళ్ల మాదిరిగానే చుట్టుపక్కల ప్రాంతాలనూ శుభ్రపరచుకోవాలని సూచించారు. ‘‘మన ఇంటిని శుభ్రం చేసుకొని ఆ చెత్తనంతా రోడ్లమీద పారబోయటం మంచిదికాదు. కలిసికట్టుగా దేశాన్ని శుభ్రపరచాలి. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను వదిలిపెట్టేయాలి. స్వచ్ఛ భారత్‌ ఉత్సాహాన్ని తగ్గనీయబోమని ప్రతినబూనాలి’’ అని పిలుపునిచ్చారు.

శత కోటి వ్యాక్సిన్లతో సామర్థ్యం చాటాం

కరోనా వ్యాక్సిన్లను దేశంలో వంద కోట్ల మందికి ఇవ్వడం వల్ల మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసిందని మోదీ పునరుద్ఘాటించారు. వంద కోట్ల మైలురాయిని దాటిన తర్వాత దేశం మరింత ఉత్సాహం, పునరుత్తేజ శక్తితో ముందుకెళ్తోందన్నారు. ‘‘..ఈ ఉద్యమం విజయవంతమవుతుందని నాకు ముందునుంచీ నమ్మకం ఉంది. ప్రజల శక్తి సామర్థ్యాలమీద ప్రగాఢ విశ్వాసం ఉంది. వైద్య ఆరోగ్య సిబ్బంది త్రికరణ శుద్ధితో పనిచేశారు. అవరోధాలన్నింటినీ అధిగమించి, అత్యధిక మందికి టీకా అందించి, ఆరోగ్య భద్రత కల్పించారు’’ అని ఆయన శ్లాఘించారు.

ఐక్యత లేకపోతే వివాదాల్లో ఇరుక్కుపోతాం

ఉక్కు మనిషి సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఈ నెల 31న ప్రతి ఒక్కరూ దేశ సమైక్యత కోసం ఏదో ఒకటి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘మన మధ్య ఐక్యత లేకపోతే నిత్య నూతన వివాదాల్లో ఇరుక్కుపోతాం. సమైక్యంగా ముందడుగు వేస్తే గౌరవం, అభివృద్ధి రెండూ లభిస్తాయి. పటేల్‌ జీవితం, ఆలోచనల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పాటలు, సంగీతం, నాటకం, నాట్యం, సాహిత్యం జత కలిస్తే జీవితం అర్థవంతంగా మారుతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో విభిన్న భాషలు, యాసల్లో వచ్చిన దేశభక్తి గీతాలే యావద్దేశాన్ని ఏకతాటిపై నిలిపాయి. మన యువతరం అలాంటి దేశభక్తి గీతాలను రచించి ఉత్సాహాన్ని నింపొచ్చు. ఆ గీతాలు వారివారి మాతృభాషల్లో, లేదంటే హిందీ, ఇంగ్లిష్‌లలోనైనా రాయవచ్చు’’ అని చెప్పారు. పోలీసు దళాలు, సైన్యంలో పురుషులే ఉండాలనే భావన గతంలో ఉండేదని, 2014తో పోలిస్తే మహిళా పోలీసుల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. అమృతోత్సవాలను ప్రస్తావిస్తూ గిరిజన వీరుడు బిర్సా ముండా ప్రత్యేకతను కొనియాడారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని