అక్రమ రిజిస్ట్రేషన్లు.. అనధికార వసూళ్లు

ప్రధానాంశాలు

అక్రమ రిజిస్ట్రేషన్లు.. అనధికార వసూళ్లు

ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లతో సబ్‌ రిజిస్ట్రార్లకు కాసుల పంట
నిబంధనలు బేఖాతరు.. యథేచ్ఛగా లావాదేవీలు

ఈనాడు, హైదరాబాద్‌: అనుమతిలేని లేఅవుట్‌లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను సర్కారు నిలిపివేయడం, కొందరు సబ్‌ రిజిస్ట్రార్లకు కాసుల పంట పండిస్తోంది. సుమారు ఏడాదిగా ఎల్‌ఆర్‌ఎస్‌ లేని 25 లక్షల ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీన్ని కొందరు సబ్‌రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్‌శాఖ ఉద్యోగులు అవకాశంగా మలచుకుని వేల రూపాయలను దండుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఎల్‌ఆర్‌ఎస్‌లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. కిందటి సంవత్సరం అక్టోబరు 31 చివరి తేదీ కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ అంశం న్యాయస్థానాలకు చేరడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ నిలిచిపోయింది. సుమారు ఏడాదిగా ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్ల క్రయవిక్రయాలకు అవకాశం లేకపోవడంతో కొందరు రియల్టర్లు, ప్లాట్ల యజమానులు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లకు తెరతీశారు.

అక్రమ లావాదేవీలు ఇలా...

గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లకు సైతం రిజిస్ట్రేషన్లు చేసేవారు. అనుమతుల జోలికి వెళితే.. నిబంధనల ప్రకారం లేఅవుట్‌లలో పార్కులు, రోడ్లు ఇతరత్రా ఖాళీలు వదలాలి. ఈ నేపథ్యంలో వేలకొద్దీ అనధికార లేఅవుట్‌లు ఏర్పడ్డాయి. వీటిలో ప్లాట్లను నకిలీ ఇంటి నంబర్లతోనూ, వ్యవసాయ భూమి పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. పూర్వ ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో పాటు మంచిర్యాల పరిధిలోనూ భారీగా ఈ తరహా లావాదేవీలు జరుగుతున్నాయి. కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు ఇన్‌ఛార్జులుగా ఉన్న సమయంలో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు కానిచ్చేస్తున్నారు. సాధారణంగా రోజుకు 20, 30 లావాదేవీలు జరిగేచోట.. 70... 80 వరకు జరుపుతున్నారు. పూర్వ వరంగల్‌ జిల్లాలో ఒక సబ్‌రిజిస్ట్రార్‌ అదనంగా రూ.20 వేలు- రూ.50 వేలు ముట్టజెపితే ఏదైనా సరే రిజిస్ట్రేషన్‌ చేయడానికి సిద్ధంగా ఉంటారు.

అమ్మలేక అప్పు

అక్రమ లావాదేవీల సంగతి అటుంచితే.. కొందరు అనధికార లేఅవుట్‌లో తీసుకున్న ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ కాక.. ఇతరులకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జనగామ సమీపంలో ఓవ్యక్తి రూ.5 లక్షలు వెచ్చించి ప్లాట్‌ కొన్నారు. దీన్ని అగ్రిమెంట్‌పై విక్రయించేందుకు ప్రయత్నించగా.. మార్కెట్‌ ధర కన్నా 25 శాతం తక్కువ ఇస్తామంటున్నారు. చివరకు ప్లాటును తనఖా పెట్టి వడ్డీకి అప్పు తెచ్చుకున్నారు.


ధరణికి 5.15 కోట్ల హిట్లు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవల పోర్టల్‌ ధరణికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఆదివారం రాత్రి సమయానికి 5,15,42,502 మంది ఈ పోర్టల్‌ను సందర్శించారు. గతేడాది అక్టోబరు 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభించగా.. నవంబరు 2 నుంచి ఆన్‌లైన్‌ సేవలు మొదలయ్యాయి. ధరణిలో తమ భూముల వివరాలు నమోదుకాని భూ యజమానులు పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరు నాటికి పరిష్కరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు పోర్టల్‌లో తమ భూమి వివరాలు కనిపిస్తాయా అని వారు అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 41 సేవలను ధరణిలో అందుబాటులోకి తెచ్చారు. వాటిలో 31 ఐచ్ఛికాలు వివిధ సేవలకు సంబంధించినవి కాగా.. 10 ఐచ్ఛికాలు వివరాలను అందజేసేవి ఉన్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని