పోలీస్‌ ముట్టడి.. ఆబ్కారీ కట్టడి

ప్రధానాంశాలు

పోలీస్‌ ముట్టడి.. ఆబ్కారీ కట్టడి

మత్తు దందాపై  రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మత్తు దందా ఆట కట్టించేందుకు ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖల సంయుక్త కార్యాచరణ ఊపందుకొంది. గంజాయి, హుక్కా, గుట్కా విక్రయాలు, రవాణాను నియంత్రించే దిశగా పోలీస్‌, ఆబ్కారీ శాఖలు 30 రోజుల ప్రణాళికతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాయి. ఆంధ్ర-ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి గంజాయి దిగుమతి అవుతుండటంతో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దించారు. ఆయా సరిహద్దులతోపాటు హైదరాబాద్‌లో ధూల్‌పేట వంటి అడ్డాలను నియంత్రించగలిగితే గంజాయి దందా దాదాపుగా ఆగిపోతుందని భావిస్తున్నారు.

రెండు రోజులుగా దాడులు ఇలా..

మేడ్చల్‌ జిల్లాలో ఎక్సైజ్‌ బృందం కీలక ఆపరేషన్‌ చేపట్టి రూ.2 కోట్ల విలువైన 5 కిలోల మెపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకొంది. ఈ దాడికి నేతృత్వం వహించిన ఉపకమిషనర్‌ డేవిడ్‌రవికాంత్‌, సూపరింటెండెంట్‌ చంద్రయ్యల బృందాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం అభినందించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో దాడులు చేసి రూ.5 లక్షల విలువైన గుట్కా, కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 12 మందిపై కేసులు నమోదు చేశారు.

మహబూబ్‌నగర్‌ క్లాక్‌టవర్‌ ప్రాంతంలో రూ.లక్ష విలువైన గుట్కా ప్యాకెట్లను, హుక్కా యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.

వనపర్తి జిల్లాలో రూ.3.26 లక్షలు, గద్వాలలో రూ.30 వేలు, సిద్దిపేటలో రూ.26 వేల విలువైన గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్‌ ఇంతెజార్‌గంజ్‌ ప్రాంతంలో పాన్‌ షాపుల్లో తనిఖీలు చేపట్టి నిషేధిత గుట్కాలను పట్టుకున్నారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం అంతారంలో ఓ దాబాలో గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 200 పాన్‌ షాపుల్లో దాడులు చేశారు. పెద్దఎత్తున గుట్కా ప్యాకెట్లు, హుక్కా పాట్లు, గంజా సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని