ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు కృషి

ప్రధానాంశాలు

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు కృషి

మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కార్ఖానా, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే దిశగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో ఆదివారం ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఆధ్వర్యంలో మాదిగ ఉద్యోగుల జాతీయ 5వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకు అధికారమిచ్చే అంశంపై 2004లో సుప్రీం కోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చిందని, 2020లో ఈ అంశంపై అనుకూలంగా స్పందించిందన్నారు. రెండు సందర్భాల్లో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువడిన నేపథ్యంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు అవసరమని అభిప్రాయపడిందన్నారు. చీఫ్‌ జస్టిస్‌, ప్రధాని, హోంమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కేంద్ర సహాయ మంత్రులు నారాయణస్వామి, మురుగన్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఆయన హయాంలోనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. భాజపా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వర్గీకరణ అంశానికి సానుకూలంగా స్పందించిందని, అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ వైఖరి కొంత మనస్తాపం కలిగించిందన్నారు. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వర్గీకరణ చివరి అంకానికి చేరిందని, అకస్మాత్తుగా ఆయన ఉపరాష్ట్రపతి కావడంతో ముందుకు సాగలేదని తెలిపారు. ప్రస్తుతం వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రిగా మాదిగల పక్షపాతి కిషన్‌రెడ్డి, ఇద్దరు మాదిగ బిడ్డలు నారాయణస్వామి, మురుగన్‌ కేంద్ర మంత్రులుగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా వర్గీకరణకు చట్టబద్ధత లభిస్తుందన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. నవంబర్‌ 24న మాదిగ విద్యార్థులతో ‘చలో దిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్‌, భాజపా మహిళా మోర్చా నాయకురాలు ఆకుల విజయ, మాదిగ ఉద్యోగుల మహాసభ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావ్‌ మాదిగ, తెలంగాణ అధ్యక్షుడు దేవేంద్రప్రసాద్‌లతో పాటు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుల నుంచి పెద్దసంఖ్యలో మాదిగ ఉద్యోగులు, నేతలు పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని