Cyber Attack: అది చాలా క్రిటికల్‌

ప్రధానాంశాలు

Cyber Attack: అది చాలా క్రిటికల్‌

సైబర్‌ దాడులతో మౌలిక సదుపాయాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతే..?

దారుణమైన విపత్తులు తప్పవంటున్న పరిశోధకులు

ఆ ముప్పు పొంచి ఉందని హెచ్చరిక

ఒటావా: ప్రపంచంలోని వ్యవస్థలన్నీ ఇప్పుడు ఆధునిక సాంకేతికతపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ సదుపాయం ఒక్కరోజు లేకపోయినా చాలామందికి రోజు గడవని పరిస్థితి చూస్తున్నాం. అలాంటిది టెక్నాలజీ ఆధారంగా నడిచే విద్యుత్తు, ఆరోగ్య, ఆర్థిక, ప్రభుత్వ తదితర ముఖ్యమైన సేవలన్నీ ఒక్కసారిగా నిలిచిపోతే? ఊహించడమే కష్టంగా ఉంది కదూ! ‘క్రిటికల్‌ సిస్టమ్స్‌’గా పిలిచే ఈ కీలక మౌలిక వ్యవస్థలు కూడా సైబర్‌ దాడులకు గురయ్యే ప్రమాదముందని... అదే జరిగితే అనూహ్యమైన, అత్యంత దారుణమైన విపత్కర పరిణామాలను ఎదుర్కోక తప్పదని కెనడాకు చెందిన నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎన్‌ఎస్‌సీఐ) సంస్థ హెచ్చరించింది. సైబర్‌ దాడి అనగానే... ఇంటర్నెట్‌తో అనుసంధానమైన ఫోన్లు, కంప్యూటర్లపై ఎటాక్‌ జరిగిందని భావిస్తుంటారు చాలామంది! కానీ.. మౌలిక సదుపాయాలు, ఆస్తులు, అత్యవసర సేవలు, సాంకేతిక నెట్‌వర్క్‌లు, ప్రాసెసింగ్‌ వ్యవస్థలు కూడా ఈ దాడులకు మినహాయింపు కాదని ఎన్‌ఎస్‌సీఐ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో మాల్‌వేర్‌ (రేన్సమ్‌వేర్‌) సాయంతో జరిగిన సైబర్‌ దాడికి... అమెరికాలోని అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థల్లో ఒకటైన సీఎన్‌ఏ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ చిక్కింది!


పరిణామాలు ఊహించగలమా!

ప్రపంచంలోని మౌలిక వ్యవస్థలన్నీ ఒక్కసారిగా నిలిచిపోతే... ఏ స్థాయిలో, ఏ విధమైన నష్టం వాటిల్లుతుంది? అనంతర పరిణామాలు ఎలా ఉంటాయి? సైబర్‌ దాడులను అడ్డుకునేలా వీటిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? అన్న ప్రశ్నలు పరిశోధకులకు తాజా సవాలు విసురుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ... ‘ఏఏ21-287’ పేరుతో ఓ హెచ్చరిక జారీచేసింది. ఇంటర్నెట్‌ ద్వారా రాన్సమ్‌వేర్‌ను ప్రవేశపెట్టి తాగునీటి సరఫరా వ్యవస్థను దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నట్టు పేర్కొంది. అదే జరిగితే- జల సేకరణ, శుద్ధి, పంపిణీ, నిర్వహణ కార్యకలాపాలతో పాటు.. మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా స్తంభించిపోవచ్చని విశ్లేషించింది.


ముందే పసిగట్టడం అంత సులభం కాదు...

ఇప్పుడు వ్యవస్థలన్నీ అత్యాధునిక ఆటోమేషన్‌ టెక్నాలజీ, అనలటిక్స్‌ ఆధారంగా పనిచేస్తున్నాయి. దీంతో మనిషి ప్రమేయం అంతగా అవసరం లేకుండానే చాలా రంగాల్లో ముఖ్యమైన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అదే సమయంలో ఈ వ్యవస్థలు... నిపుణులు, కంప్యూటర్లు ముందుగా పసిగట్టలేని సైబర్‌ దాడులకు గురయ్యే ముప్పు పెరిగిందన్నది నిపుణుల మాట.

సైబర్‌ దాడితో.. ఇరాన్‌లో మూతపడ్డ గ్యాస్‌ స్టేషన్లు

దుబాయ్‌: ఇరాన్‌లో గ్యాస్‌ స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని మంగళవారం భారీ సైబర్‌ దాడి చోటుచేసుకుంది. దాని దెబ్బకు దేశవ్యాప్తంగా గ్యాస్‌ స్టేషన్లన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి. పెట్రోలు బంకులూ పనిచేయలేదు. రాజధాని నగరం టెహ్రాన్‌ సహా అనేక ప్రాంతాల్లో ఇంధనం నింపుకొనేందుకు వచ్చిన వాహనాలు స్టేషన్ల వద్ద బారులు తీరి కనిపించాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని