వరిసాగు వద్దనడానికి ఆయనెవరు?

ప్రధానాంశాలు

వరిసాగు వద్దనడానికి ఆయనెవరు?

సిద్దిపేట కలెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి

కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌

ఈనాడు- హైదరాబాద్‌, దిల్లీ- న్యూస్‌టుడే, గాంధీభవన్‌: వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన డీలర్లను సిద్దిపేట కలెక్టర్‌ వెంకటరామరెడ్డి ఆదేశించడం వరి రైతులను బ్లాక్‌ మెయిల్‌ చేయడమేనని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. రైతు ఏ పంట వేయాలో నిర్ణయించడానికి కలెక్టర్‌ ఎవరని నిలదీశారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్‌ తెచ్చుకున్నా ఊరుకోనంటూ ఆయన ఒక నియంతలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం వరి రైతుల బాధ్యతల నుంచి తప్పుకొనేందుకే ఈ ఎత్తుగడ అని ఆయన మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ వరి విత్తనాలు విక్రయిస్తే దుకాణాలు సీజ్‌ చేస్తామని కలెక్టర్‌ ఏ అధికారంతో హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. వరిసాగు చేయొద్దన్నప్పుడు రూ.కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు కట్టడం ఎందుకని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిలదీశారు. కొండపోచమ్మసాగర్‌ చుట్టూ ఉన్న విత్తన కంపెనీల మామూళ్ల కోసమే కలెక్టర్‌ అలా మాట్లాడుతున్నారని అయోధ్యరెడ్డి, బెల్లయ్యనాయక్‌లు ఆరోపించారు. వెంకటరామరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ, కలెక్టర్‌ వ్యాఖ్యల వీడియోను ఈ-మెయిల్‌ ద్వారా పంపారు. ఇదే వీడియోను రాష్ట్రపతి భవన్‌ ట్విటర్‌కు జత చేశారు.

నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు: భాజపా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాదిరిగానే కలెక్టర్‌ వెంకటరామరెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, విత్తన డీలర్ల సమావేశంలో అహంకారపూరితంగా మాట్లాడిన ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని భాజపా సీనియర్‌ నేత గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారణ జరిపించాలని మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


అసత్య ప్రచారాలు సరికాదు: కలెక్టర్‌

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: యాసంగిలో వరి సాగు వద్దనే అంశంపై సిద్దిపేటలో వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని తాను చెప్పానని సిద్దిపేట కలెక్టర్‌ వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. రైతులకు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పానన్నారు. కానీ తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని.. ఇది ఎంతమాత్రం సరికాదంటూ కలెక్టర్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం సిద్దిపేట సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు వీడియోలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అందులో కిలో  వరి విత్తనాలు విక్రయించినా.. విత్తన దుకాణాలు సీజ్‌ చేస్తామని ఉండటం గమనార్హం.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని