ఈ చావుకు కారకులెవరు?

ప్రధానాంశాలు

ఈ చావుకు కారకులెవరు?

ఓ రైతు పొలం ఆన్‌లైన్‌లో మరొకరి పేరుతో నమోదు

అదే అదనుగా దాన్ని అమ్మేసిన ఆ వ్యక్తి

మనస్తాపంతో బాధితుడి హఠాన్మరణం

ఆదిల్‌ ఇంటి ఆవరణలో మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన. (అంతరచిత్రంలో) మృతుడు నిరంజన్‌

అన్నంపెట్టే భూమే అన్నదాతకు ప్రాణసమానం. అలాంటి నేల తన ప్రమేయం లేకుండానే మరొకరి పాలవడంతో ఓ రైతు గుండె మండింది. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడం, అవుతుందనే నమ్మకం కూడా లేకపోవడంతో చివరికి ఆ గుండె ఆగింది.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెల్లి గ్రామానికి చెందిన నిరంజన్‌ (53)కు సర్వే నంబరు 211లో ఇనామ్‌గా వచ్చిన 2.7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి పొరపాటున అదే సర్వే నంబరులో పొలం ఉన్న ఆదిల్‌ అనే వ్యక్తి పేరుతో ఆన్‌లైన్‌లో నమోదైంది. ఇదే అదనుగా భావించిన అతను ఆ భూమిని 2020 డిసెంబరులో గద్వాలకు చెందిన వ్యక్తులకు విక్రయించాడు. కొనుగోలుదారులు భూమి స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన సమయంలో జరిగిన మోసాన్ని గుర్తించిన నిరంజన్‌ హతాశుడయ్యారు. తన పొలం తాలూకూ పాత పట్టాదారు పాసు పుస్తకం నకలు ప్రతులను తహసీల్దారు కార్యాలయంలో సమర్పించి ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. రెండు రోజుల క్రితం కొనుగోలుదారులు భూమిచుట్టూ కంచె వేసేందుకు సిద్ధమవడంతో మరింత ఆందోళనకు గురైన బాధితుడు సోమవారం కూడా తహసీల్దారు కార్యాలయ అధికారులను సంప్రదించారు. వాళ్లు ఏం సమాధానం చెప్పారో..ఏమో! నేరుగా పొలం వద్దకు వెళ్లి గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. వనపర్తి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే మరణించాడు. భూమి అక్రమ విక్రయమే తన భర్త మరణానికి కారణమని ఆరోపిస్తూ భార్య, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆదిల్‌ ఇంటి ముందు ఉంచి నిరసనకు దిగారు. మంగళవారం పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని వనపర్తి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

- న్యూస్‌టుడే, కొత్తకోట గ్రామీణం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని