‘కార్పొరేట్‌’ మాయ.. విద్యార్థులకు ‘పరీక్ష’

ప్రధానాంశాలు

‘కార్పొరేట్‌’ మాయ.. విద్యార్థులకు ‘పరీక్ష’

చదివేది ఎస్‌.ఆర్‌.నగర్‌... చూపేది ధర్మారెడ్డి కాలనీలో

ఫలితం.. సుదూరంగా ఇంటర్‌ పరీక్ష కేంద్రం కేటాయింపు

అనుమతుల్లేకుండా కాలేజీలు నడుపుతున్నా పట్టని ఇంటర్‌బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌: ఆయన నివాసం ఖైరతాబాద్‌లో... కళాశాల దగ్గరగా ఉంటుందని ఎస్‌.ఆర్‌.నగర్‌లోని ఓ కార్పొరేట్‌ ఇంటర్‌ కళాశాలలో కుమార్తెను చేర్పించారు. ఆ అమ్మాయి రోజూ నాలుగంతస్థుల భవనంలోని కళాశాలలో ఇంటర్‌(ద్వితీయ) తరగతులకు హాజరవుతోంది. తొలి ఏడాది పరీక్షలు మొదలవడంతో హాల్‌టికెట్‌ చూసుకున్న ఆయనకు షాక్‌ తగిలినంత పనైంది. కారణం.. తన కుమార్తె జేఎన్‌టీయూహెచ్‌ సమీప ధర్మారెడ్డి కాలనీలోని కళాశాలలో చదువుతున్నట్లు, పరీక్షా కేంద్రం బాచుపల్లిలో కేటాయించినట్లు అందులో కనిపించటమే. మరో కార్పొరేట్‌ సంస్థ అత్తాపూర్‌ ప్రాంతంలో కళాశాల నడుపుతూ రికార్డుల్లో మాత్రం కూకట్‌పల్లిలో ఉన్నట్లు చూపింది. ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. నగరంలోని కొన్ని కార్పొరేట్‌ కళాశాలల మాయ ఇది. కొన్నింటికే ఇంటర్‌ బోర్డు నుంచి అనుమతులు తీసుకొని, అందుకు రెండుమూడింతలు ఎక్కువగా భవనాల్లో అవి కళాశాలలను నడుపుతున్నాయి. ఫలితంగా పరీక్షల సందర్భంగా వేలాది డే స్కాలర్‌ విద్యార్థులు పాట్లు పడుతున్నారు. ఇదేమని అడిగితే ‘కళాశాల వద్దకు విద్యార్థిని ఉదయం ఆరింటికి తీసుకొని రండి.. బస్సులో తీసుకెళ్తాం’ అంటున్నారని విద్యార్థి తండ్రి ఒకరు వాపోయారు.

ఇంటర్‌బోర్డుదే అసలు నేరం

కళాశాలలు లాభార్జన కోసం కొన్నింటికే ఇంటర్‌బోర్డు నుంచి అనుమతి పొందుతున్నాయి. అనుబంధ గుర్తింపునకు ఫీజు చెల్లించాలి. ప్రభుత్వ శాఖల నుంచి ధ్రువపత్రాలు పొందాలి. అప్పుడు బోర్డు నుంచి అనుమతి వస్తుంది. సెక్షన్లు పెంచుకోవాలన్నా అదనంగా రుసుం చెల్లించాలి. ఆ మొత్తాన్ని మిగుల్చుకునేందుకు యాజమాన్యాలు కక్కుర్తి పడుతున్నాయి. అనుమతి తీసుకున్న సెక్షన్లలో సరిపడా విద్యార్థులు చేరకున్నా.. కొన్ని క్యాంపస్‌లలో ఎక్కువ మంది చేరినా విద్యార్థులను సర్దుబాటు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు అనుమతి లేకుండానే తరగతులు నడుపుతున్నాయి. ఇలా ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లో కనీసం 150-200 కళాశాలలున్నట్లు అంచనా. భారీ భవంతులు, అపార్ట్‌మెంట్లలో తరగతులు నడుస్తున్నా ఇంటర్‌బోర్డు మాత్రం యాజమాన్యాలతో కుమ్మక్కై.. పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి ఉన్న కళాశాలలకు కచ్చితంగా బోర్డు వద్ద కాలేజ్‌ కోడ్‌ రాస్తారు... అలా రాయలేదంటే అనుమానించాల్సిందేనని ఇంటర్‌ అధికారి ఒకరు తెలిపారు.

అలాంటి వాటిపై చర్యలు చేపట్టాల్సిందే

విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా చేస్తున్న కళాశాలల యాజమాన్యాలు ఏవైనా ఇంటర్‌బోర్డు చర్యలు తీసుకోవాల్సిందే. హాల్‌టికెట్‌ చూసుకునే వరకు విద్యార్థులు ఏ క్యాంపస్‌ నుంచి పరీక్షకు హాజరవుతున్నారో తెలియని పరిస్థితి దారుణం. దాన్ని పూర్తిగా మార్చేలా అధికారులు వ్యవహరించాలి.

- గౌరి సతీష్‌, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలల సంఘం

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని