మురిపిస్తున్న తెల్లబంగారం

ప్రధానాంశాలు

మురిపిస్తున్న తెల్లబంగారం

మార్కెట్లలో పత్తి దూకుడు.. ‘మద్దతు’ను మించిన ధర

ఈటీవీ - నల్గొండ: గత ఏడాది క్వింటాకు రూ.నాలుగైదు వేలు పలికిన పత్తి ధర ఈసారి రూ.8వేలు దాటింది. వరంగల్‌ జిల్లా నెక్కొండలో మంగళవారం అత్యధికంగా రూ.8,350కి దూసుకెళ్లింది. మరో నాలుగు జిల్లాల్లోనూ రూ.8వేలను మించింది. బులియన్‌ మార్కెట్‌లా రోజురోజుకూ ధరల్లో తేడా కనిపిస్తోంది. మద్దతు ధర కన్నా రూ.2 వేలు ఎక్కువ పలుకుతుండటంతో ఈసారి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈపాటికే సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కేంద్రాలు ప్రారంభమవ్వాల్సి ఉండగా అసలు ఆ ఆలోచనే చేయకపోవడానికి కారణం అధిక ధరలేనని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ విపణిలో పత్తికి డిమాండున్నా అనుకున్న రీతిలో దిగుబడులు లేవు. ఈ నేపథ్యంలో ఇపుడున్న పంటకు భారీగా ధరలు పలుకుతున్నాయి. ఈసారి రాష్ట్రంలో 42లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా 3కోట్ల క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా 376 జిన్నింగ్‌ మిల్లులుండగా, సీసీఐ కొనుగోళ్లు లేక మిల్లుల యజమానులే పత్తిని కొంటున్నారు. తెల్లబంగారం కనిష్ఠ మద్దతు ధర రూ.6,025. అదీ 8 శాతం తేమతో ఉంటేనే ఆమాత్రం చెల్లిస్తారు. కానీ అనేక మంది రైతుల పత్తిలో తేమ శాతం ప్రస్తుతం 15-20 వరకు ఉంది. అయినా మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. సీసీఐ కొనే సరకు 8-12 శాతం తేమతో ఉండాలి. కానీ 20 శాతం తేమతో కూడిన పత్తికి వ్యాపారులు, మధ్యవర్తులు రూ.8వేల వరకు చెల్లిస్తున్నారు. ఆదివారం ఉదయం క్వింటాకు రూ.7,500, సాయంత్రం రూ.7,600 పలికింది. సోమవారం ఉదయం రూ.7,600 ఉన్న ధర సాయంత్రానికి రూ.7,700కు చేరింది. మంగళవారం గరిష్ఠంగా ధరలు పలికాయి.

ఊపందుకున్న విక్రయాలు  

ధరలు పెరుగుతుండటంతో కొందరు రైతులు పత్తిని ఇప్పుడే విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈసారి దిగుబడులు సగానికి తగ్గినా చేతికందిన పంట నాణ్యంగా ఉంది. ఆగస్టులో భారీవర్షాల కారణంగా చేలల్లో నీరు చేరి చాలా వరకు పత్తి దెబ్బతింది. పెట్టుబడులు, కౌలుధరలు పెరగడంతో రైతులు అయోమయంలో పడినా మంచి ధరలు వస్తుండటంతో ఊరట చెందుతున్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని