తడబడుతున్న ఏడడుగులు

ప్రధానాంశాలు

తడబడుతున్న ఏడడుగులు

పెరుగుతున్న విడాకులు

కుటుంబ న్యాయస్థానాల సంఖ్యా పెంపు

* ఇద్దరూ ఉద్యోగులు.. చేతినిండా సంపాదన. ఆనందాన్ని ఆస్వాదించేందుకు అనువైన వాతావరణం. అయినా ఏదో వెలితి. కన్నవారికి దగ్గరగా ఉండాలనేది అతడి ఆలోచన. కొన్నాళ్లు సరదాగా గడపాలనేది ఆమె యోచన. భార్య మాటకే ప్రాధాన్యం ఇస్తున్నావంటూ తల్లిదండ్రుల వేదన. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేవంటూ భార్య దెప్పిపొడుపులు. ఎటూ సర్ది చెప్పలేక పెళ్లయిన 4 నెలలకే విడాకులు కావాలంటూ న్యాయవాదిని ఆశ్రయించాడు.

* అమ్మాయి వయసు 25, అబ్బాయి వయసు 28. పెళ్లయిన మూడేళ్లకే విడిపోయారు. జీవితాన్ని అనుక్షణం ఆస్వాదించాలనుకునే మనస్తత్వం ఆమెది. పనే లోకంగా గడిపేవాడు అతడు. ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత దూరమయ్యాయి. మూడేళ్లు గడుస్తున్నా భర్తలో మార్పు రాకపోవటంతో భార్య విడాకులు కోరింది. చివరకు పరస్పర అంగీకారంతో విడిపోయారు.

అన్యోన్యంగా సాగాల్సిన సంసారం.. ఒకరికొకరం అన్నట్టుగా గడపాల్సిన దంపతులు.. కొద్దిపాటి మనస్పర్థలకే విడిపోతున్నారు. విడాకుల కోసం కోర్టుల తలుపు తడుతున్నారు. కాపురాన్ని చక్కదిద్దాల్సిన పెద్దలూ బిడ్డల నిర్ణయాన్నే సమర్థిస్తున్నారు. ఫలితంగా ఏటేటా హైదరాబాద్‌లో విడాకుల కేసులు పెరుగుతున్నాయి. పరస్పర అవగాహన లోపించడం, అహం చంపుకోలేక విడిపోతున్న యువజంటలే ఎక్కువగా ఉంటున్నారని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఆడపిల్లలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులకు చేదోడుగా నిలుస్తున్నారు. ఈ ఆర్థిక స్వేచ్ఛే కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదనే ధైర్యం చిన్న సమస్య తలెత్తినా విడిపోవడానికి ప్రేరేపిస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రేమ వివాహం, సంతాన లోపం, వేధింపులు, అధిక కట్నం తదితర సందర్భాల్లో విడాకులకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. భర్త లేకపోయినా ఒంటరిగా బతకొచ్చని.. కలహాల కాపురాలెందుకంటూ కుమార్తెలను.. భార్య దూరమైనా మరో తోడు వెతుక్కోవచ్చని కొడుకులను ఒప్పిస్తున్నారని సునీతాదేవి అనే న్యాయవాది తెలిపారు. భార్యాభర్తల మధ్య ఇలా మూడో వ్యక్తుల జోక్యమే వివాదాలకు ఎక్కువ కారణమవుతున్నాయని ఆమె విశ్లేషించారు.


ఏటా 20,000 కేసులు

హైదరాబాద్‌ నగరంలోని 10 కుటుంబ న్యాయస్థానాల్లో రోజుకు 50-80 విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన ఏటా 18,000-20,000 వరకూ జంటలు విడాకులు కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నట్లు అంచనా. వీరిలో 25-35 మధ్య వయస్కులు 75 శాతం, 35 ఏళ్లు పైబడినవాళ్లు 25 శాతం ఉన్నారు. పెళ్లయి ఏడాది తిరగకుండానే విడిపోతామనే దంపతులు 60 శాతం వరకూ ఉంటున్నట్లు తెలుస్తోంది.


పెరుగుతున్న న్యాయస్థానాలు..

* హైదరాబాద్‌ పరిధిలో ఉన్న మొత్తం 10 న్యాయస్థానాల్లో విడాకులకు సంబంధించిన వివాదాలు నమోదవుతుంటాయి. ఒక్కో న్యాయస్థానానికి రోజుకు ఐదేసి, సిటీ సివిల్‌ కోర్టులోని ఫ్యామిలీ కోర్టులకు కనీసం పదేసి చొప్పున కేసులు వస్తున్నాయి.
* పురానీహవేలీలోని ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టులో 1,310 విడాకుల కేసులు, 39 మెయింటెనెన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఒకటో అదనపు న్యాయస్థానంలో 1,800 పెండింగ్‌ కేసులున్నాయి. సికింద్రాబాద్‌లో ఇటీవలే మరో కుటుంబ న్యాయస్థానాన్ని ప్రారంభించారు. కూకట్‌పల్లి న్యాయస్థానంలో 600 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


ఫోనూ ఓ కారణమే

* భార్య/భర్త ఫోన్‌ మాట్లాడుతూనో లేదా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతూనో భాగస్వామిని నిర్లక్ష్యం చేయటం

* ఉద్యోగం చేసే ఆడపిల్లలు తమ కన్నవారి బాధ్యతలు స్వీకరించటం

* ఆర్థిక సమస్యలు, భర్త మద్యం లేదా ఇతర వ్యసనాలకు బానిస కావడం, వివాహేతర సంబంధాలు,

* అదనపు కట్నం, ఇరువర్గాల కుటుంబ సభ్యుల అనవసర జోక్యం


ఐటీలోనే ఎక్కువ..

విడాకుల కేసులు ఎక్కువగా ఐటీ రంగంలోనే నమోదవుతున్నాయి. ఈ రంగంలో ఉన్నవారిలో కొందరు విడిపోవడం మామూలేనని భావిస్తుండటం ఒక కారణం. రాత్రుళ్లు ఎక్కువగా పని చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తడం, దాంపత్య జీవితంలో అసంతృప్తి తదితర కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు.


ఎన్‌సీఆర్‌బీ-2020 నివేదిక ఇలా

నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో 2020 నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో మహిళలపై వేధింపులకు సంబంధించి 2020లో 1,692 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్తింటి వేధింపులకు సంబంధించి 1,226, దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారంటూ 208, ఇతరత్రా నేరాలకు పాల్పడుతున్నట్లు 258 కేసులు ఉన్నాయి. ఇలా కోర్టుకొస్తున్నవారిలో 90 శాతంమంది విడాకులు కోరుతున్నారు.


ఐదేళ్లుగా పెరుగుతున్న కేసులు

గత ఐదేళ్లుగా నగరంలో విడాకులు కోరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 2016లో 3,080 జంటలు విడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. గత ఐదేళ్లలో ఈ సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.  


తల్లిదండ్రుల తీరు మారాలి

- శారద, ఫ్యామిలీ కౌన్సెలర్‌

కాపురంలో కలతలు సహజం. ఇద్దరూ కలసి కూర్చుని చర్చించుకుంటే చాలా సమస్యలు తొలగిపోతాయి. కానీ ఎవరికి వారే తామెందుకు తగ్గాలనే ఆలోచనతో విచక్షణ కోల్పోతున్నారు. విడాకులు కావాలంటూ వచ్చేవారిలో కొందరు ఎందుకు విడిపోతున్నారని అడిగితే వింత సమాధానాలు చెబుతారు. సర్ది చెప్పాల్సిన పెద్దలు కొందరు మరింత ఆజ్యం పోస్తున్నారు.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని