పోలండ్‌ పెట్టుబడులకు ప్రోత్సాహం

ప్రధానాంశాలు

పోలండ్‌ పెట్టుబడులకు ప్రోత్సాహం

ఆ దేశ రాయబారితో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పోలండ్‌ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు పెద్దఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తామని, ఇతర రాష్ట్రాలు, దేశాల కంటే అత్యుత్తమమైన రాయితీలు కల్పిస్తామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే వారికి పక్షం రోజుల్లో అనుమతులిస్తామని, సత్వర భూకేటాయింపులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూరుస్తామన్నారు. భారత్‌లో పోలండ్‌ రాయబారి ఆడమ్‌ బురకోవ్‌స్కీ మంగళవారం ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.  ‘‘వాహనాల తయారీ, వైమానిక ఉత్పత్తులు, ఐటీ, ఆహారశుద్ధి రంగంలో పేరొందిన పోలండ్‌ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల సంస్థలు తమ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించాయి. అవి విజయవంతంగా నడుస్తున్నాయి’’ అని కేటీఆర్‌ వారికి తెలిపారు.

మా దేశంలో పర్యటించాలి

తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతంగా ఉందని, మౌలికవసతులు, మానవ వనరుల లభ్యత, ప్రభుత్వ సహకారం అదనపు బలమని ఆడమ్‌ అన్నారు. తమ దేశ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నారని వెల్లడించారు. తమ దేశంలో పర్యటించాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఇందుకు మంత్రి సమ్మతించారు.

నేటి నుంచి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన

ఫ్రాన్స్‌ దేశంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు మంగళవారం అర్ధరాత్రి దాటాక బయల్దేరి వెళ్లారు. బుధవారం ఉదయం ఆ దేశ రాజధాని పారిస్‌ చేరుకుంటారు. ఆయన వెంట పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, డిజిటల్‌, వైమానిక విభాగాల సంచాలకులు కొణతం దిలీప్‌, ప్రవీణ్‌కుమార్‌లు ఉన్నారు. మంత్రి బుధవారం సాయంత్రం నుంచి ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులతో భేటీ అవుతారు. 28, 29 తేదీల్లో ఫ్రాన్స్‌ సెనేట్‌లో జరిగే భారత ఆశయ వాణిజ్య వేదిక (యాంబిషన్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం) సమావేశాల్లో పాల్గొంటారు. వివిధ రంగాల పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులతో సమావేశమవుతారు. ప్రఖ్యాత కంపెనీలను, పరిశ్రమలను సందర్శిస్తారు.కేటీఆర్‌ చివరిసారిగా 2018 జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థికవేదిక సదస్సుకు వెళ్లారు. ఆ తర్వాత విదేశీ పర్యటన ఇదే. ఈ నెల రెండో వారంలో ఫ్రాన్స్‌కు చెందిన వందమంది పారిశ్రామికవేత్తల బృందం హైదరాబాద్‌ వచ్చి కేటీఆర్‌తో భేటీ అయింది. తమ దేశానికి రావాలని మంత్రిని ఆహ్వానించింది. ఆ తర్వాత వారం రోజులకే ఫ్రాన్స్‌ ప్రభుత్వంనుంచి ఆహ్వానం అందింది. భారీగా పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లాలని కేటీఆర్‌ నిర్ణయించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని