అంకురాలకు భారీగా రాయితీలు

ప్రధానాంశాలు

అంకురాలకు భారీగా రాయితీలు

 గ్రామీణ ప్రాంతాలకు ఊతం..మహిళలకు సాయం

  ఉత్తర్వుల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఆవిష్కరణల విధానం (ఇన్నోవేషన్‌ పాలసీ) కింద అంకుర పరిశ్రమలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలకు, మహిళల నాయకత్వంలోని వాటికి కూడా ఇవి వర్తిస్తాయి. రాష్ట్ర ఆవిష్కరణల విభాగం దీనికి నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. ‘‘అంకుర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. ఇక్కడే ప్రారంభం కావాలి. ఉద్యోగాల్లో 50 శాతం మంది స్థానికులు ఉండాలి. ఆవిర్భావం నుంచి సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.వంద కోట్లకు మించరాదు. సంస్థ స్థాపించిన తర్వాత విభజన గానీ, పునర్నిర్మాణం కాని జరగకూడదు’’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాయితీలు ఇలా..
ఎస్‌జీఎస్టీ రీఇంబర్స్‌మెంటుకు వార్షిక టర్నోవర్‌ ఏడాదికి రూ.కోటి చొప్పున మూడేళ్లపాటు ఉండాలి. ఎస్‌జీఎస్టీలో రూ.10లక్షల పరిమితితో ప్రభుత్వం సాయం చేస్తుంది. దేశంలో పేటెంటు కోసం రూ.2లక్షలు, విదేశాల్లో పేటెంటుకు రూ.10లక్షల వరకు చేయూత అందిస్తుంది. అంతర్జాతీయ మార్కెటింగ్‌ కోసం మొత్తం ఖర్చులో 30% (రూ.5లక్షల పరిమితి) భరిస్తుంది. నియామకాల రాయితీ కోసం మొదటి సంవత్సరం ఒక్కొక్క ఉద్యోగికి రూ.10వేల చొప్పున సంస్థకు చెల్లిస్తుంది. ఏటా 15% వృద్ధి గల సంస్థలకు టర్నోవర్‌లో 5% (రూ.10లక్షల పరిమితి) అందజేస్తుంది.
* గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణల కోసం తెలంగాణ ప్రభుత్వ గుర్తింపున్న అంకురాలకు రూ.లక్ష, పైలట్‌ గ్రాంటుగా రూ.2లక్షలు, సీడ్‌ గ్రాంట్‌గా రూ.50 వేల నుంచి రూ.2లక్షలు లభిస్తుంది. కార్పస్‌ ఫండ్‌గా ఇంకుబేషన్ల ద్వారా రూ.పది లక్షలు ఇస్తుంది.
* మహిళల ఆధ్వర్యంలో నడిచే అంకురాలు విధిగా ‘ఉద్యం’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని ఉండాలి. నమోదు సమయంలో ఒక మహిళకు లేదా మహిళా బృందానికి ఆ అంకుర పరిశ్రమలో విధిగా 51% వాటా ఉండాలి. ప్రభుత్వం నిధులిచ్చేప్పుడు కచ్చితంగా 33% వాటా ఉండాలి. పాలకమండలిలోని డైరెక్టర్లలో 33% ఓట్లు మహిళలకే ఉండాలి. నాయకత్వంలోనూ అంతే. అంకుర పరిశ్రమల్లో మహిళా వ్యవస్థాపకురాలు లేదా సహ వ్యవస్థాపకురాలిగా నమోదై ఉండాలి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని