మన ఆయుధమే మనకు మృత్యువై..!

తాజా వార్తలు

Updated : 09/03/2021 12:14 IST

మన ఆయుధమే మనకు మృత్యువై..!

* ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీపై విమర్శలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఒక కీలక శిఖరాన్ని కాపాడేందుకు  యుద్ధం జరుగుతోంది.. మన జవాన్ల  వద్ద ఉన్న ఒక శతఘ్నితో శత్రువులు ఆ శిఖరాన్ని ఆక్రమించకుండా పోరాడుతున్నారు.. ఉన్నట్టుండి మన జవాన్ల వద్ద  ఉన్న ఫిరంగిలో అమర్చిన భారీ తూటా అక్కడే పేలిపోయింది.. దీంతో మనవారిలో  కొందరు గాయపడ్డారు.. ఈ ఘటన కీలక సమయంలో శత్రుసేనకు కలిసొచ్చే అంశమేగా..! అక్కడ భూభాగం మన చేజారిపోయే ప్రమాదం ఏర్పడినట్లేగా..? అదృష్టవశాత్తూ ఇది ఎక్కడా జరగలేదు.. కానీ, జరగదని చెప్పలేము. మన దళాలు వినియోగిస్తున్న కొన్నిరకాల ఆయుధాలు జవాన్ల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా రెండు వారాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు జవాన్లు మరణించడంతో పాటు మరికొందరు గాయపడ్డారు.

ఫిబ్రవరి 23న జమ్ముకశ్మీర్‌లోని అక్నూర్‌ సెక్టార్‌ 105 ఎంఎం ఫీల్డ్‌గన్‌(ఫిరంగి వంటిది)తో లైవ్‌ ఫైరింగ్‌ డ్రిల్‌ జరుగుతోంది.  హఠాత్తుగా అది పేలిపోయింది.. దాని శకలాలు ముగ్గురు సైనికులను తాకాయి. వారిలో గన్నర్‌గా పనిచేస్తున్న సయాన్‌ ఘోష్‌ అక్కడికక్కడే కన్నుమూశాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక గత మంగళవారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజిలో ఇదే రకమైన ఫిరంగితో జవాన్లు కాల్పులు సాధన చేస్తుండగా.. ఒక తూటా ఆ ఫిరంగిలోనే పేలింది. దీంతో బీఎస్‌ఎఫ్ జవాను సతీష్‌కుమారు కన్నుమూశాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటనపై బీఎస్‌ఎఫ్‌‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, రెండు ఘటనలపై కోర్ట్ ‌ఆఫ్ ఎంక్వైరీ జరుగుతోంది. నాసిరకమైన మందుగుండు సామగ్రి కారణంగానే ఇవి జరిగినట్లు అనుమానిస్తున్నారు.

ఈ మందు గుండు ఎక్కడిది..?

ఈ రెండు ఘటనల్లో వాడిన మందుగుండును ప్రభుత్వ రంగానికి చెందిన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు కర్మాగారాల్లో తయారు చేశారు. ఇదేం చిన్నా చితకా సంస్థకాదు. దీనికి దేశవ్యాప్తంగా 41 కర్మాగారాలు ఉన్నాయి.  సైన్యం అంతర్గత నివేదికల ప్రకారం 2014-2019 వరకు ఈ సంస్థ తయారు చేసిన ఆయుధాల కారణంగా 400కు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.  దాదాపు రూ.903 కోట్లు విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సొమ్ముతో దాదాపు 100 శతఘ్నులను కొనుగోలు చేయవచ్చు. కానీ, ఓఎఫ్‌బీ మాత్రం ఈ ప్రమాదాల్లో కేవలం 19శాతం మాత్రమే తమ ఆయుధాల వల్ల జరిగాయని చెబుతోంది. మహారాష్ట్రలో జరిగిన ఒక్క ప్రమాదంలో 19 మరణాలు సంభవించాయని పేర్కొంటోంది.  ఇక తాజా ఘటనపై విచారణ పూర్తి అయ్యాకే తాము స్పందిస్తామని ఓఎఫ్‌బీ ప్రతినిధి గగన్‌ చతుర్వేదీ తెలిపారు. వాస్తవానికి ఈ ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయుధ డిజైన్‌ లోపం, నిల్వ చేసే విధానం, నిర్వహణ, షెల్‌ జీవితకాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

మరోవైపు రేపు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వించనున్నారు. దీనిలో ఈ ఫ్యాక్టరీల పనితీరును మెరుగుపర్చేలా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని