కొవిడ్‌ విలయం: 20% వృద్ధులకు సన్నిహితులు దూరం!

తాజా వార్తలు

Published : 15/06/2021 01:08 IST

కొవిడ్‌ విలయం: 20% వృద్ధులకు సన్నిహితులు దూరం!

హెల్ప్‌ఏజ్‌ ఇండియా సర్వేలో వెల్లడి

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి సృష్టించిన విలయాలతో ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ దాటికి వేల సంఖ్యలో కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 20.8శాతం మంది వృద్ధులు కరోనా కారణంగా తమ సన్నిహితులను కోల్పోయినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలు ఉన్నట్లయితే వారి ప్రాణాలకు ముప్పు ఉండేది కాదని సర్వేలో పాల్గొన్న వృద్ధులు అభిప్రాయపడ్డారు.

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ అన్ని వయసుల వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వృద్ధులకు ఎదురవుతున్న సవాళ్లు, వారిపై వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ‘హెల్ప్‌ఏజ్‌ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఓ సర్వే నిర్వహించింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై నగరాల్లో మొత్తం 3526 మంది వృద్ధులపై సర్వే జరిపింది. సర్వేలో పాల్గొన్న వృద్ధుల్లో 20.8శాతం మంది తమ కుటుంబసభ్యులు లేదా స్నేహితులు కరోనా కాటుకు బలైనట్లు వెల్లడించారు. ఇక 42.1శాతం మంది వృద్ధులు తమకు వైరస్‌ సోకితే ఆసుపత్రిలో చెందాల్సి వస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా 34శాతం మంది ఐసోలేషన్‌లో ఉండడం ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు.

ఆర్థికంగా ఇతరులపై ఆధారపడిన వృద్ధులు కరోనా కారణంగా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 52శాతం వృద్ధులు తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కోల్పోవడం లేదా జీతాల్లో కోత విధించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విచారం వ్యక్తం చేశారు.

పెరిగిన ఆరోగ్య సమస్యలు.. దూషణలు..

కరోనా సమయంలో విధించిన ఆంక్షలు వృద్ధులకు మరింత భారంగా మారాయి. సర్వేలో పాల్గొన్న అత్యధిక మంది (52శాతం) కీళ్ల నొప్పులతో బాధపడగా, 24.4శాతం మంది తీవ్ర కంటిచూపు సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. 44.9శాతం మందికి రోజువారీ నడకకు ఇబ్బందిగా మారినట్లు పేర్కొన్నారు. ఇలా పలు విధాలుగా కరోనా మహమ్మారి తమ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని తెలిపారు. ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 66శాతం మంది ఇప్పటికే కనీసం ఒకడోసు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది వృద్ధులు తమ కుటుంబసభ్యుల చేత దూషణలకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిలో ఎక్కువగా కుమారులతో (43శాతం) దూషణకు గురికాగా, కోడళ్లు (27.8శాతం) కూడా దూషించినట్లు పేర్కొన్నారు.

సెకండ్‌ వేవ్‌ సమయంలో కేవలం వృద్ధులపై హింసకు సంబంధించి తమ హెల్ప్‌లైన్‌ కేంద్రానికి వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చినట్లు హెల్ప్‌ఏజ్‌ ఇండియా పేర్కొంది. ఇది మొదటి విజృంభణ సమయంతో పోలిస్తే 18శాతం ఎక్కువని తెలిపింది. సెకండ్‌ వేవ్‌ కాలంలోనే ఆర్థిక సహాయం, కౌన్సిలింగ్‌కు సంబంధించి వృద్ధుల నుంచి మొత్తం 20వేలకు పైగా కాల్స్‌ వచ్చినట్లు వెల్లడించింది. ఇలా కరోనా సమయంలో భిన్న విధాలుగా వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇవి నిదర్శనాలని హెల్ప్‌ఏజ్‌ మిషన్‌ నిర్వాహకులు డాక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని