షహీన్‌బాగ్ నిరసనల వెనక భాజపా: ఆప్‌

తాజా వార్తలు

Published : 17/08/2020 21:45 IST

షహీన్‌బాగ్ నిరసనల వెనక భాజపా: ఆప్‌

భాజపాలో చేరిన పలువురు సీఏఏ నిరసనకారులు

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా దిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన ఆందోళనలను భారతీయ జనతా పార్టీ (భాజపా) రాజకీయాల కోసం దుర్వినియోగం చేసిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. తాజాగా షహీన్‌బాగ్ ఆందోళనకు ప్రాతినిధ్యం వహించిన వారిలో కొందరు భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో ఆప్‌ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘దిల్లీ పోలీసులతో కలిసి అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా షహీన్‌బాగ్‌లో ప్రదర్శనలను చేపట్టింది. ఎన్నికల్లో భాజపా ప్రధాన సమస్య షహీన్‌బాగ్ నిరసనలు. ఆ నిరసనలకు ప్రాతినిధ్యం వహించిన వారు ఆ పార్టీలో చేరడంతో భాజపా ఎటువైపు ఉందన్న విషయం బయటపడింది. భాజపా నాయకుల సూచన మేరకే దిల్లీ పోలీసులు నిరసనకారులను అక్కడ నుంచి ఖాళీ చేయించలేదు’’ అని ఆప్‌ నాయకుడు సౌరభ్ భరద్వాజ్‌ ఆరోపించారు.

‘‘దేశంలో ప్రతి వర్గానికి చేరువయ్యేందుకు, ట్రిపుల్ తలాక్‌కు ముగింపు పలకాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించి వారంతా భాజపాలో చేరారు. భాజపాపై ముస్లింలకు నమ్మకం పెరిగిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ, మేం వారిని ఎప్పుడూ ఓటు బ్యాంక్‌గా చూడలేదు’’ అని దిల్లీ భాజపా అధ్యక్షుడు అదేష్ గుప్తా అన్నారు. షహీన్‌బాగ్‌తో పాటు దిల్లీలోని ఓఖ్లా, నిజాముద్దీన్‌కు చెందిన సుమారు వంద మంది ఆదివారం భాజపాలో చేరారు. వీరిలో సీఏఏ నిరసనలకు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా ఉండటం గమనార్హం. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షహీన్‌బాగ్ నిరసనల గురించి భాజపా-ఆప్‌ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనల్లో ఆప్‌ హస్తం ఉందని భాజపా ఆరోపించింది. సీఏఏకి వ్యతిరేకంగా సుమారు మూడు నెలలపాటు దిల్లీలోని షహీన్‌బాగ్‌లో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని