హిమానీ నదాల లోతును కొలిచేందుకు సిద్ధం!

తాజా వార్తలు

Published : 21/12/2020 01:27 IST

హిమానీ నదాల లోతును కొలిచేందుకు సిద్ధం!

దిల్లీ: గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల హిమాలయాలు ప్రభావితం అవుతున్న వేళ.. హిమానీ నదాల (గ్లేసియర్) లోతును కొలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా వాటిలోని నీటి లభ్యతను అంచనా వేసేందుకు యోచిస్తున్నట్లు భూశాస్త్ర మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే వేసవి కాలంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతామని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం రాజీవన్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీపీఓఆర్‌) చేపడుతుండగా, హిమాలయాల వాతావరణంపై ‘హిమాన్ష్‌’ కేంద్రం పరిశోధన జరుపనుందని ఎన్‌సీపీఓఆర్‌ డెరెక్టర్‌ రవిచంద్రన్‌ వెల్లడించారు. ముఖ్యంగా చంద్రా నదీ పరివాహక ప్రాంతంలోని ఏడు హిమానీ నదాలను అధ్యయనం చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. చీనాబ్‌ నదితో పాటు సింధూ నదికి ఉపనదిగా చంద్రా నది ఉంది.

అయితే, ఉపగ్రహాల సహాయంతో ఈ హిమానీ నదాల విస్తీర్ణాన్ని ఇప్పటికే గుర్తించగలిగామని, వాటి పరిమాణాన్ని తెలుసుకునేందుకు తాజా ప్రాజెక్టు దోహదపడుతుందని రవిచంద్రన్‌ పేర్కొన్నారు. హిమానీనదాల లోతును అంచనా వేయడం వల్ల అక్కడ ఉన్న నీటి లభ్యతను తెలుసుకోవడంతో పాటు హిమానీనదాలు పెరుగుతున్నాయా? లేదా కరిగిపోతున్నాయా? అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చని అన్నారు. వీటిని ఉపగ్రహ చిత్రాలతో అంచనా వేయడం సాధ్యం కాదు. అందుకే మైక్రోవేవ్‌ సిగ్నల్‌ను ఉపయోగించే ర్యాడార్‌ సాంకేతికను వినియోగించనున్నారు. ఇవి మంచు నుంచి చొచ్చుకొనివెళ్లి రాతిభాగం వరకూ చేరుకోగలుగుతాయి. ఇప్పటికే ఈ సాంకేతికతను అమెరికా, యూకే దేశాలు వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం చేపట్టే ప్రాజెక్టులో వారి సహాయాన్ని కూడా తీసుకుంటామని రవిచంద్రన్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి..
గగనతలంలో నిఘా నేత్రాలు
భారత అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని