పాక్‌పై చర్యలకు ఇదే మంచి సమయం: వీకే సింగ్

తాజా వార్తలు

Updated : 30/10/2020 14:50 IST

పాక్‌పై చర్యలకు ఇదే మంచి సమయం: వీకే సింగ్

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడి తమ పనేనంటూ పాకిస్థాన్‌ అంగీకారాన్ని భారత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని కేంద్రంమంత్రి వీకే సింగ్ కేంద్రానికి సూచించారు. పుల్వామా ఘటన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ నాయకత్వంలో సాధించిన ఘన విజయమంటూ ఆ దేశ మంత్రి ఫవాద్ చౌధురి సంచలన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఆ దేశాన్ని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. ఫవాద్ అంగీకారం ఆ దారుణ ఘటనలో పాక్‌ ప్రమేయాన్ని నిరూపిస్తోందన్నారు. గతేడాది పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. 

‘పుల్వామా ఉగ్ర ఘటనకు సంబంధించి సత్యాన్ని అంగీకరించినందుకు నేను ఆయనకు కృజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ ఘటనకు పాక్‌ కారణమని మేం మొదటి నుంచి చెప్తున్నాం. ఆ దేశంలో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ దేశాన్ని ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచాల్సిన అవసరం ఉందని, ఎవరూ ఆ దేశానికి సహాయం అందించకూడదని ప్రపంచానికి తెలియజేయడానికి భారత ప్రభుత్వం ఆ మంత్రి అంగీకారాన్ని ఉపయోగించుకుంటుందని నేను అనుకుంటున్నాను’ అని వీకే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆ ఉగ్రఘటన తర్వాత  కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై ఆయన మండిపడ్డారు. ‘ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. కానీ, మనదేశంలోకి ఉగ్రవాదాన్ని పంపే దేశం పట్ల అవి తమ ప్రేమను చాటుకున్నాయి. అలాంటి ప్రతిపక్ష నేతలను మీరు ఎలా వర్గీకరిస్తారు? నేను మాత్రం వారిని భారత వ్యతిరేకులు అంటాను’ అని మంత్రి విరుచుకుపడ్డారు. 

కాగా, తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాక్‌ మంత్రి మాట మార్చారు. ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, తన మాటలను వక్రీకరిస్తున్నారని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని