చైనా ఆసుపత్రి నిర్లక్ష్యం..కోటి మందికి టెస్టులు!

తాజా వార్తలు

Published : 16/10/2020 15:08 IST

చైనా ఆసుపత్రి నిర్లక్ష్యం..కోటి మందికి టెస్టులు!

ఒక్కకేసు కూడా నమోదు కాలేదని వెల్లడి

బీజింగ్‌: చైనాలోని కింగ్‌డావ్‌ ఆసుపత్రి తాజాగా కరోనా వైరస్‌కు క్లస్టర్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే, అక్కడి ఆసుపత్రిలో చిన్న నిర్లక్ష్యం కారణంగానే దాదాపు కోటి మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించాల్సి వచ్చిందని స్థానిక మున్సిపల్‌ కమిషన్‌ స్పష్టంచేసింది. కింగ్‌డావ్‌ ఆసుపత్రిలోని సీటీ రూంలో డిస్‌ఇన్‌ఫెక్షన్‌ సరిగా చేయనందువల్లే వైరస్‌కు‌ ‌క్లస్టర్‌గా మారినట్లు తేల్చింది. దీనికి బాధ్యులైన ఆసుపత్రి డీన్‌ను విధుల నుంచి తొలగించడమే కాకుండా పూర్తి విచారణ చేపట్టినట్లు పేర్కొంది.

దాదాపు కోటి జనాభా కలిగిన కింగ్‌డావో నగరంలో ఈ మధ్య 12 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం నగరంలో దాదాపు కోటి మందికి కొవిడ్‌ టెస్టులు చేయాలని నిర్ణయించింది. ఈ పనిని కేవలం ఐదు రోజుల్లోనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే కోటి 4లక్షల మంది శాంపిళ్లను సేకరించగా, వీరిలో 88లక్షల ఫలితాలు విశ్లేషించారు. వీరిలో ఏ ఒక్కరిలోనూ వైరస్‌ బయటపడలేదని ప్రకటించింది. కేవలం స్థానిక చెస్ట్‌ ఆసుపత్రిలోని సీటీ రూంలో డిస్‌ఇన్‌ఫెక్షన్‌ సరిగా చేయకపోవడం వల్లే వైరస్‌ క్లస్టర్‌కు కారణమైనట్లు కింగ్‌డావో ప్రావిన్స్‌ హెల్త్‌ కమిషన్ ప్రధానాధికారి మా లిక్సిన్‌ ప్రకటించారు. ప్రస్తుతానికి ఎలాంటి కేసులు నమోదుకానప్పటికీ సమాజంలోని క్రాస్‌-ఇన్‌ఫెక్షన్‌ వల్ల మరిన్ని క్లస్టర్లు ఏర్పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని లిక్సిన్‌ అభిప్రాయపడ్డారు.

అక్టోబర్ 1 నుంచి 8 వరకు జరిగిన ‘గోల్డెన్‌ వీక్‌’ హాలిడేలో భాగంగా దాదాపు 64 కోట్ల మంది చైనీయులు స్వదేశీ పర్యటన చేసినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇక చైనాలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కింగ్‌డావో నగరం కేంద్రబిందువుగా ఉంది. తాజాగా జరిగిన ‘గోల్డెన్‌ వీక్‌’ హాలీడేలో స్వదేశీ పర్యాటకులు భారీ సంఖ్యలో ఈ నగరాన్ని సందర్శించారు. అది ముగిసిన అనంతరమే తాజా క్లస్టర్‌ బయటపడడంతో చైనా వ్యాప్తంగా మరోసారి ఆందోళన మొదలయ్యింది. ఇదివరకే ఓ ఫుడ్‌ మార్కెట్‌లో కొన్ని కేసులు వెలుగులోకి రావడంతో దేశ రాజధాని బీజింగ్‌లో భారీ సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు జరిపారు. అనంతరం, మరోసారి కింగ్‌డావ్‌లో ఈ స్థాయిలో పరీక్షలు నిర్వహించారు.

ఇదిలాఉంటే, శుక్రవారం నాడు ఒక్కరోజే దేశవ్యాప్తంగా 24మందిలో వైరస్‌ గుర్తించినట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. వీటిలో ఇక్క షాంఘైలోనే 12కేసులున్నట్లు తెలిపింది. అయితే, ఈకేసులన్నీ బయటనుంచి చైనాకు వచ్చిన వారిలోనే గుర్తించినట్లు సీఎన్‌హెచ్‌సీ వెల్లడించింది.  

ఇవీ చదవండి..
చైనీయుల విహారం: వారంలో 64కోట్ల మంది పర్యటన!
ఐరోపా, ఆసియాల్లో కరోనా ఉద్ధృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని