కొవిడ్‌ రికవరీల్లో.. అగ్రస్థానంలో భారత్‌!

తాజా వార్తలు

Updated : 21/09/2020 10:29 IST

కొవిడ్‌ రికవరీల్లో.. అగ్రస్థానంలో భారత్‌!

ప్రపంచంలో మొత్తం రికవరీల్లో 19శాతం భారత్‌లోనే
24గంటల్లో 86వేల కేసులు, 1130 మరణాలు!

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నిత్యం దాదాపు 90వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ నుంచి కోలుకుంటున్నవారు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3కోట్లు దాటగా వారిలో ఇప్పటికే 2కోట్ల 20లక్షల మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న వారిలో భారత్‌లో 43లక్షల 96వేల మంది ఉన్నారు. ఇది ప్రపంచ రికవరీల్లో 19శాతం కావడం విశేషం. దీంతో వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న అమెరికాలో రికవరీల సంఖ్యను భారత్‌ దాటేసింది. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 42లక్షల మంది కోలుకోగా, బ్రెజిల్‌లో 38లక్షల మంది కోలుకున్నారు. తాజాగా భారత్‌లో ఈ సంఖ్య దాదాపు 44లక్షలకు చేరుకోవడం ఊరట కలిగించే విషయం.

24గంటల్లో 86వేల కేసులు, 1130 మరణాలు
గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7,31,534 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 86,961 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో సోమవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,87,580కు చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 43లక్షల 96వేల మంది కోలుకోగా, మరో 10లక్షల 3వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న మరో 1130 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 87,882కు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 79.68శాతం ఉండగా, మరణాల రేటు 1.61శాతంగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని