సాగు చట్టాలకు ప్రతిగా 3 సవరణ బిల్లులు 

తాజా వార్తలు

Published : 07/07/2021 09:58 IST

సాగు చట్టాలకు ప్రతిగా 3 సవరణ బిల్లులు 

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం 

ముంబయి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. వాటికి ప్రతిగా మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సహకారం, ఆహార-పౌర సరఫరాలకు సంబంధించి మూడు సవరణ బిల్లులను అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టింది. వ్యవసాయ ఉత్పత్తులకు ట్రేడర్లు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే అధిక రేటును చెల్లించేలా వాటిలో ఓ నిబంధనను చేర్చారు. పంటను విక్రయించిన ఏడు రోజుల్లోపే అన్నదాతలకు డబ్బును అందించాలని కూడా స్పష్టం చేశారు. సొమ్ము చెల్లించకుండా వారిని వేధింపులకు గురిచేస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా, రూ.5 లక్షల పరిహారం వసూలు చేసేలా కూడా నిబంధనలను పొందుపర్చారు. తాజా బిల్లుల ప్రకారం.. ఇకపై రాష్ట్రంలో నిత్యావసర సరకుల నిల్వపై పరిమితులు విధించేందుకు; వాటి ఉత్పత్తి, సరఫరాను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు దక్కుతాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు అన్నదాతల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉండటం వల్లే తాజా బిల్లులను తాము ప్రవేశపెట్టినట్లు మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్‌ థోరాట్‌ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని కేబినెట్‌ సబ్‌ కమిటీ ఈ ముసాయిదా బిల్లులను తయారుచేసిందని చెప్పారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై ఉన్నత స్థాయి దర్యాప్తు 
భాజపా నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌ను ట్యాప్‌ చేశారంటూ మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నానా పటోలె చేసిన ఆరోపణలపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు రాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సె పాటిల్‌ ఆదేశించారు. 2016-17లో తన ఫోన్‌తో పాటు ఎన్సీపీ, భాజపా, శివసేనకు చెందిన కీలక నేతలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల ఫోన్‌లు ట్యాపింగ్‌కు గురయ్యాయని నానా పటోలె ఆరోపించిన సంగతి గమనార్హం. 

అసెంబ్లీ ఆవరణలో భాజపా సభ్యుల సమావేశం 
మహారాష్ట్రలో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ ఆవరణలో విపక్ష భాజపా సభ్యులు.. శాసనసభ భేటీ తరహాలో సమాంతర సమావేశాన్ని నిర్వహించారు. స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రిసైడింగ్‌ అధికారి భాస్కర్‌ జాదవ్‌తో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో 12 మంది విపక్ష ఎమ్మెల్యేలపై సోమవారం సస్పెన్షన్‌ వేటు పడింది. వారి సస్పెన్షన్‌ను నిరసిస్తూ.. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో భాజపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యే కాళిదాస్‌ కోలంకర్‌ను స్పీకర్‌గా ఫడణవీస్‌ ప్రకటించారు. ఇదంతా టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కావడం కలకలం సృష్టించింది. ఈ పరిణామాలపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భాజపా తీరు అసెంబ్లీని అవమానించేలా ఉందన్నారు. 

కమలదళంతో మళ్లీ చేతులు కలపబోం: ఉద్ధవ్‌ ఠాక్రే 
ఒకప్పటి మిత్రపక్షం భాజపాతో శివసేన మళ్లీ చేతులు కలపబోతోందంటూ కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను మహారాష్ట్ర సీఎం, ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కొట్టిపారేశారు. కమలదళంతో మళ్లీ జట్టు కట్టే యోచనేదీ లేదని స్పష్టం చేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని