అక్కడ కనిపిస్తే కాల్చివేతే!

తాజా వార్తలు

Published : 11/09/2020 17:58 IST

అక్కడ కనిపిస్తే కాల్చివేతే!

కరోనావైరస్‌ దరిచేరకుండా కిమ్ ప్రభుత్వ ఆదేశాలు

ప్యాంగ్‌యాంగ్: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ఉత్తరకొరియా అత్యంత తీవ్రమైన చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. చైనా నుంచి దేశంలోకి వచ్చే వ్యక్తులపై ‘షూట్-టు-కిల్’ ఆదేశాలు జారీ చేయడమే అందుకు నిదర్శనం. ఈ విషయాన్ని దక్షిణ కొరియాలో యూఎస్‌ బలగాలకు కమాండర్‌గా ఉన్న రాబర్ట్ అబ్రహాం వెల్లడించారు. ప్రపంచమంతా కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఉత్తరకొరియా మాత్రం ఒక్క కేసు కూడా నమోదైనట్లు ఇంతవరకు ప్రకటించకపోవడం గమనార్హం. కాగా, చైనా నుంచి వైరస్‌ దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు జనవరిలో ఆ దేశం సరిహద్దులను మూసివేసింది. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఆ ప్రాంతంలో ప్రత్యేక కార్యకలాపాల దళాన్ని మోహరించడంతో పాటు, దానికి ‘షూట్-టు-కిల్’ అధికారాన్ని ఇచ్చిందని ఓ సమావేశంలో భాగంగా అబ్రహాం వెల్లడించారు. దాంతో చైనా, ఉత్తరకొరియా సరిహద్దులో ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న వ్యక్తులు, వారు అక్కడ ఉండటానికి గల కారణాలతో సంబంధం లేకుండా చంపేసే అధికారం ఆ దళానికి దఖలు పడిందన్నారు. 

మరోవైపు ఆ దేశాన్ని టైఫూన్ మేసక్ ఇక్కట్ల పాలు చేసింది. ఆ టైఫూన్‌తో 2000 ఇళ్లు ధ్వంసమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ కారణంగా, ప్యాంగ్యాంగ్‌ రెచ్చగొట్టే చర్యలకు పూనుకోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాకపోతే త్వరలో కిమ్ జోంగ్ ఉన్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న అధికార పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేశం కొత్త ఆయుధ వ్యవస్థను ప్రదర్శించే అవకాశమూ లేకపోలేదంటున్నారు. అయితే, అక్కడి మిలిటరీ ప్రభుత్వం దేశం తిరిగి సాధారణ స్థితికి రావడం, వైరస్‌ను కట్టడి చేయడం మీదే ప్రధానంగా దృష్టి సారించిందని తెలుస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని