అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం ఎప్పుడూ రహస్యమే..!

తాజా వార్తలు

Updated : 04/10/2020 15:00 IST

అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం ఎప్పుడూ రహస్యమే..!

వైట్‌హౌస్‌‌ గోప్యత పాటిస్తోందంటున్న చరిత్రకారులు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు నేను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్రంప్ పేర్కొనగా, మరో 48గంటలు గడిస్తే కానీ ఏ విషయమైనా తెలుస్తుందని అతని సన్నిహితవర్గాలు ప్రకటించాయి. అయితే, అమెరికా చరిత్రను చూస్తే మాత్రం చాలా సార్లు అధ్యక్షుల ఆరోగ్యంపై వైట్‌హౌజ్‌ అసత్యాలనే బయటకు చెప్పినట్లు వెల్లడవుతోంది. కొన్నిసార్లు వారి ఆరోగ్యసమస్య చిన్నదైనా.. మరి కొన్నిసార్లు తీవ్ర సమస్యలు ఉన్నా బహిరంగపరచలేదనే వాదన ఉంది. వీటిని తెలుసుకోవడానికి ప్రజలకు ఒక్కోసారి దశాబ్ద సమయం పట్టిందంటేనే అధ్యక్షుల ఆరోగ్యంపై వైట్‌హౌస్‌ వ్యవహారం అర్థమవుతోంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుల ఆరోగ్యంపై శ్వేతసౌధం  పారదర్శకంగా ఉంటుందా? అన్నవిషయం మరోసారి చర్చనీయాంశమైంది.

ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌లాగానే వైరస్‌ ప్రభావాన్ని తక్కువగా చేసి చూపిన అప్పటి అధ్యక్షుడు వూడ్రో విల్సన్‌ కూడా 1918నాటి స్పానిష్‌ ఫ్లూ బారినపడ్డారు. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఎప్పటి మాదిరిగానే విల్సన్‌ అనారోగ్య విషయాన్ని వైట్‌హౌస్‌‌ రహస్యంగానే ఉంచింది. 1919లో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన సందర్భంగా పారిస్‌లో చర్చలు జరుపుతున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన విల్సన్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే, ఆయనపై విషప్రయోగం జరిగిందని విల్సన్‌ వ్యక్తిగత వైద్యుడు కేరీ గ్రేసన్‌ అనుమానించి, ఈ విషయాన్ని వైట్‌హౌస్‌‌కు లేఖ ద్వారా తెలియపరిచారు. అయితే, వూడ్రో విల్సన్‌ స్పానిష్‌ ఫ్లూ బారినపడిన విషయం తర్వాత బయటపడింది. 100సంవత్సరాల తర్వాత ఇలాంటి ఘటనే పునరావృతమైంది. మహమ్మారిల విజృంభణ సమయంలో వాటి ప్రభావాన్ని తక్కువగా చేసి చూపేందుకు ప్రయత్నించిన ఇద్దరు అధ్యక్షులు వైరస్‌ బారినపడ్డారు. అయితే, భయాందోళనలను తగ్గించడానికే అలా చేశానని ట్రంప్‌ సమర్థించుకున్నప్పటికీ, అధ్యక్షుడు అలా చేయడానికి రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికల ముందు అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకూడదనే ట్రంప్ అలా చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ, వైరస్‌ ప్రభావాన్ని తక్కువగా చేసి చూపడానికి వూడ్రో విల్సన్‌కు మాత్రం వేరే కారణాలున్నట్లు జాన్బారీ రాసిన పుస్తకం ద్వారా అర్థమవుతోంది. తాజాగా ట్రంప్‌ ఆరోగ్యంపై వైట్‌హౌస్‌‌ ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందనే విషయంపై అక్కడి రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అధ్యక్షుల ఆరోగ్యంపై ఎప్పుడూ గోప్యతే..!

చాలా సమయాల్లో అమెరికా అధ్యక్షుల ఆరోగ్యాన్ని, వారి వైద్యానికి సంబంధించిన విషయాలను ప్రజలకు ఎంత రహస్యంగా ఉంచారో చరిత్ర స్పష్టం చేస్తోందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ విలియం హోవెల్‌ అభిప్రాయపడుతున్నారు. వీటికి చరిత్రలో జరిగిన ఘటనలే నిదర్శనమని పేర్కొంటున్నారు. తాజాగా ట్రంప్‌ కరోనా వైరస్‌కు గురైన నేపథ్యంలో.. గతంలో అమెరికా అధ్యక్షుల ఆరోగ్య విషయాలను వైట్‌హౌస్‌‌ రహస్యంగా ఉంచిన కొన్ని సంఘటనలను చరిత్రకారులు, విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.  

*1890 కాలంలో అమెరికా అధ్యక్షునిగా ఉన్న గ్రోవర్‌ క్లీవ్లాండ్‌ కూడా తన అనారోగ్యంపై గోప్యత పాటించారు. ఐలాండ్‌ ప్రాంతంలో ఓ ప్రత్యేక షిప్‌లో అర్థరాత్రి తన నోటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. క్లీవ్లాండ్‌ నోటి నుంచి క్యాన్సర్‌ గాయాన్ని తొలగించినట్లు ఫిలడెల్ఫియాకు చెందిన వైద్య బృందం 2000సం.లో బయటపెట్టింది. అయితే, గ్రోవర్‌ తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడం రాజకీయ బలహీనత అవుతుందనే భయంతో ఈ విషయాన్ని దాచిపెట్టినట్లు తర్వాత తెలిసింది.

*ఇక 1967లో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన లిండన్‌ బీ జాన్సన్‌ కూడా శస్త్రచికిత్స ద్వారా తన చర్మానికి ఉన్న గాయాన్ని తొలగించుకున్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.

*1944 సం.లో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డీ రూజ్‌వెల్ట్‌ కూడా అధిక రక్త పోటు, గుండె జబ్బు, తీవ్ర శ్వాస కోశ సమస్యలు ఎదుర్కొన్నట్లు తేలింది. దీంతో అతను ధూమపానం తగ్గించాలని, ఆహారంపై నియంత్రణ పాటించాలని వైద్యులు ఆదేశించారు. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో.. తనకు స్వల్ప ఆరోగ్యసమస్యలు మాత్రమే ఉన్నట్లు రూజ్‌వెల్ట్‌,  వైట్‌హౌస్‌‌ సంయుక్తంగా ప్రకటించాయి. తిరిగి ఎన్నికల్లో గెలిచిన రూజ్‌వెల్ట్‌ కొన్ని నెలల కాలంలోనే(1945 ఏప్రిల్‌లో) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతని ఆరోగ్యంపై అధ్యక్ష భవనం వైద్యులు వాస్తవాలు దాచిపెట్టారని చారిత్రకారులు అనుమానం వ్యక్తం చేశారు.

*అమెరికా చరిత్రలో నిలిచిపోయిన అధ్యక్షుడు జాన్‌ ఎఫ్ కెన్నడీ కూడా ఇదే రకమైన పంథా అనుసరించారు. ప్రమాదకరమైన అడిసన్‌ వ్యాధితో పాటు తీవ్ర జీర్ణకోశ సంబంధ సమస్యలను కెన్నడీ ఎదుర్కొన్నట్లు చరిత్రకారుడు రాబర్ట్‌ డాల్లెక్‌ స్పష్టంచేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు కెన్నడీ నిత్యం దాదాపు ఎనిమిది రకాల మందులు వేసుకునేవారిని పేర్కొన్నారు. అయితే, అతను అనారోగ్య సమస్యలను దాచడానికి చాలా ప్రయత్నాలు చేశాడని, అడిసన్‌ వ్యాధి ఉన్న విషయంపై విలేకర్లు పలుసార్లు అడిగినప్పుడు కూడా కెన్నడీ ఖండించేవారని గుర్తుచేశారు.

*1955లో అధ్యక్షుడిగా ఉన్న డ్వైట్‌ డీ‌ ఐసన్‌హోవర్‌ కు కూడా ఓసారి విహారయాత్రలో ఉన్న సమయంలో తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో అతను ఆరువారాలపాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. అనంతరం రెండో దఫా అధ్యక్షునిగా పోటీచేయకపోవడమే మంచిదని అందరూ భావించారు. కానీ, అధికారిక బాధ్యతల్లో ఉంటేనే అతను త్వరగా కోలుకుంటారని వైద్యులు సిఫార్సు చేయడం గమనార్హం.

*1841లోనూ విలియం హెన్రీ హారీసన్‌ విషయంలోనూ వైట్‌హౌస్‌ ఇలాగే చేసిందని విమర్శలూ ఉన్నాయి. కేవలం అధ్యక్షునిగా ప్రమాణం చేసిన నెల రోజుల తర్వాత హెన్రీ హారీసన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తొమ్మిది రోజుల అనంతరం చివరకు ప్రాణాలు కోల్పోయారు. నిమోనియా వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ముందుగానే గుర్తించినప్పటికీ ఈ విషయాన్ని వైట్‌హౌస్‌‌ బయటకు వెల్లడించలేదు.

ఇలా అమెరికా చరిత్రలో దేశాధ్యక్షులు స్వల, తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఇలాంటి సమస్యలు సాధారణమే అయినప్పటికీ వీటి గురించి ప్రజలకు పారదర్శకంగా ఉండడంలో వైట్‌హౌస్‌‌ గోప్యత పాటించిందని చరిత్రకారులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని