ఆయన ద్వారా సంతానం పొందే భాగ్యమైనా కల్పించండి!

తాజా వార్తలు

Updated : 22/07/2021 16:45 IST

ఆయన ద్వారా సంతానం పొందే భాగ్యమైనా కల్పించండి!

 వీర్యం సేకరించి భద్రపరిచేలా ఆసుపత్రిని ఆదేశించండి
 గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన కొవిడ్‌-19 బాధితుడి భార్య

అహ్మదాబాద్‌: ఏడాది క్రితం అనేక ఆశలు, ఆకాంక్షలతో వైవాహిక బంధంతో అడుగుపెట్టిన ఆ మహిళ జీవితంలో కరోనా మహమ్మారి కారణంగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. గుజరాత్‌కు చెందిన ఆమె భర్త కొవిడ్‌-19 బారిన పడ్డారు. ప్రస్తుతం వడోదరలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అందిస్తున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారింది. ఇప్పటికే అనేక అవయవాలు పనిచేయడం మానేయడంతో ప్రాణాధార వ్యవస్థపై ఉంచారు. ఆయన జీవించడం దాదాపు అసాధ్యమని వైద్యులు తేల్చేశారు. దీంతో హతాశురాలైన ఆ మహిళ.. కట్టుకున్న వాడు దూరమైనా.. ఆయన ద్వారా ఓ సంతానాన్ని పొందాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ విషయాన్ని వైద్యుల దగ్గర ప్రస్తావించారు. ఐవీఎఫ్‌/ఏఆర్‌టీ విధానంలో భర్త ద్వారా తనకు సంతానం కలిగేలా చూడాలని, భర్త వీర్యాన్ని సేకరించి భద్రపరచాలని అభ్యర్థించగా.. ఆసుపత్రి యాజమాన్యం అందుకు నిరాకరించింది.

న్యాయస్థానం ఆదేశాలు లేకుండా ఆ విధంగా చేయలేమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో బాధిత మహిళ మంగళవారం గుజరాత్‌ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలు లేకుండా.. వీర్యం సేకరించేందుకు ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌)/ఏఆర్‌టీ (అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ) ప్రక్రియ నిర్వహించలేమని, ఆ నమూనాను భద్రపరచలేమని ఆసుపత్రి పేర్కొన్న సంగతిని బాధితురాలి తరఫు న్యాయవాది నీలయ్‌ పటేల్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ అసుతోష్‌ జె శాస్త్రి.. బాధితురాలి భర్త నుంచి నమూనా సేకరించి, వైద్య ప్రమాణాల మేరకు భద్ర పరచాలని వడోదరలోని ఆసుపత్రిని ఆదేశించారు.

‘‘అసాధారణ అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నాం. ఈ ఆదేశాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆసుపత్రి డైరెక్టర్‌కు నోటీసులు జారీచేసి శుక్రవారం (23వ తేదీ)లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి క్షణక్షణం దిగజారుతున్నందున.. తాము జారీచేసిన ఆదేశాల అంశాన్ని ఆసుపత్రికి తెలియజేయాలని మహిళను, సహాయ ప్రభుత్వ న్యాయవాదిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని