హాథ్రస్‌ బాధిత కుటుంబాన్ని కలవనున్న డీజీపీ

తాజా వార్తలు

Published : 03/10/2020 14:11 IST

హాథ్రస్‌ బాధిత కుటుంబాన్ని కలవనున్న డీజీపీ

లఖ్‌నవూ: హాథ్రస్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చర్యలకు ఉపక్రమించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇచ్చిన నివేదిక ఆధారంగా నలుగురు అధికారులను సస్పెండ్‌ చేసిన ఆయన నేడు ఉన్నతస్థాయి అధికారుల్ని హాథ్రస్‌కు పంపారు. డీజీపీ హెచ్‌సీ.అవస్థీ సహా హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీశ్‌ అవస్థీ నేడు హాథ్రస్‌లో బాధిత కుటుంబాన్ని కలవనున్నారు. ఇప్పటికే బయలుదేరిన వాళ్లు కుటుంబ సభ్యుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. అనంతరం ఆ నివేదికను సీఎంకు అందించనున్నారు. 

రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి..

మరోవైపు యూపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని.. సిట్‌ ప్రాథమిక నివేదికతో ప్రజలు ఏమాత్రం సంతృప్తిగా లేరని అన్నారు. యూపీకి చెందిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ విషయంలో జోక్యం చేసుకొని దళితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయం కోసమే.. న్యాయం కోసం కాదు..

ఇంకోవైపు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ నేడు హాథ్రస్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. వారి పర్యటన కేవలం రాజకీయాల కోసమేనని.. బాధితులకు న్యాయం అందించడం కోసం కాదని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ జిత్తులు తెలుసని.. అందుకే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భాజపాకు పట్టం కట్టారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని