కొవిషీల్డ్‌ 4 వారాల తర్వాత వేసుకునే అవకాశం ఇవ్వండి.. కేంద్రానికి కేరళ హైకోర్టు ఆదేశం

తాజా వార్తలు

Published : 06/09/2021 18:58 IST

కొవిషీల్డ్‌ 4 వారాల తర్వాత వేసుకునే అవకాశం ఇవ్వండి.. కేంద్రానికి కేరళ హైకోర్టు ఆదేశం

కోచి (కేరళ): కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు 4 వారాల తర్వాత ఎప్పుడైనా వేసుకునే సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడున్న 84 రోజుల గడువు కాకుండా ఎవరైతే ముందుగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని ముందుకొస్తారో వారికి వ్యాక్సిన్‌ వేసుకునే వెసులుబాటు కల్పించాలంది. ఆ మేరకు కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేయాలని కేంద్రానికి సూచించింది. విదేశాలకు వెళుతున్న వారికి ముందుగానే వ్యాక్సిన్‌ వేసుకునే సదుపాయం కల్పించినప్పుడు ఇక్కడే ఉన్న వారికి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 3న కేంద్రానికి ఆదేశాలు ఇవ్వగా.. సోమవారం ఆ ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి.

వ్యాక్సిన్‌ గడువు నిబంధనపై కైటెక్స్‌ గార్మెంట్స్‌ లిమిటెడ్‌ దీనిపై కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తమ పరిశ్రమకు చెందిన 5 వేల మంది కార్మికులకు ఇప్పటికే తొలి డోసు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించామని, రెండో డోసు వేయించేందుకు నిబంధనల రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నట్లు పిటిషన్‌లోపేర్కొంది. రెండో డోసు కోసం రూ.93 లక్షలు వెచ్చించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని తెలిపింది. ఈ నేపథ్యంలో ముందుగా వ్యాక్సిన్‌ వేయించుకుని కరోనా నుంచి రక్షణ పొందాలనుకునే వారికి వీలుగా కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేయాలని హైకోర్టు ధర్మాసనం కేంద్రానికి సూచించింది. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య గడువును తొలుత 4 వారాలుగా కేంద్రం నిర్దేశించిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి మరింత రక్షణ కోసం వ్యాక్సిన్‌ మరింత సమర్థంగా పనిచేయాలంటే గడువును 84 రోజులకు పెంచాలని నిపుణులు సూచించారు. దీంతో కేంద్రం గడువును పొడిగించింది. అయితే, ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలి డోసు వేసుకున్నవారు రెండో డోసు కోసం 84 రోజులు వేచి చూడాల్సిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని