Corona: మే 7తో పోలిస్తే 85% కేసులు తగ్గాయ్‌..
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 18:23 IST

Corona: మే 7తో పోలిస్తే 85% కేసులు తగ్గాయ్‌..

దిల్లీ: దేశాన్ని ఊపిరాడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్టు కేంద్రం వెల్లడించింది.  మే 7న దేశంలో భారీగా నమోదైన కొత్త కేసులతో పోలిస్తే రోజువారీ కేసుల్లో దాదాపు 85% మేర తగ్గుదల ఉన్నట్టు తెలిపింది. మే 4 నాటికి 531 జిల్లాల్లో 100కు పైగా కొత్త కేసులు నమోదుకాగా.. జూన్‌ 13 నాటికి ఆ సంఖ్య 165 జిల్లాలకు తగ్గినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. మరోవైపు, యాక్టివ్‌ కేసులు కూడా తగ్గుతున్నాయని, మే 10 నాటికి 37.45లక్షలకు పైగా ఉన్న క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 9.13లక్షలకు దిగొచ్చినట్టు వివరించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే  28.3లక్షల మేర యాక్టివ్‌ కేసులు తగ్గడం విశేషం. 

దేశంలో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం 5వేలు  కన్నా తక్కువగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ ప్రభావానికి 20 ఏళ్ల లోపువారు 11.62శాతం మంది గురికాగా.. తొలి దశలో అది 11.31శాతంగా ఉందని అధికారులు తెలిపారు. చిన్నారులపై ఈ వైరస్‌ పెద్దగా ప్రభావం చూపలేదని, అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిన్నారులు, ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  మే 4 -10 మధ్య వారంలో వీక్లీ పాజిటివిటీ రేటు అత్యధికంగా 21.4శాతం ఉండగా.. అది దాదాపు 78శాతం మేర తగ్గి ప్రస్తుతం 4.8గా కొనసాగుతోందని అధికారులు వివరించారు.

కరోనా సెకండ్‌ వేవ్‌లో డెల్టా వేరియంటే తీవ్ర ప్రభావం చూపిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ తెలిపారు. డెల్టా వేరియంట్లోనూ కొత్త రకమైన డెల్టా ప్లస్‌ వెలుగులోకి వచ్చిందన్నారు. యూరప్‌లో మార్చి నుంచి డెల్టా ప్లస్‌ వేరియంట్ కనిపిస్తోందని చెప్పారు. డెల్టా ప్లస్‌పై మరింత అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. దీన్ని ఇంకా ఒక వేరియంట్‌గా విభజించలేదని, ఇంకా దీనిపై అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. భారత్‌లో త్వరలోనే నోవావాక్స్‌ టీకా తయారీ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశకు చేరాయని, ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఆశావహంగా ఉన్నాయని వివరించారు. పిల్లల పైనా అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. 

రెండు దశల్లో కరోనా ప్రభావం ఇలా.. (వయసు వారీగా)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని