భాజపాలో చేరాలని ఎన్‌ఐఏ ఆఫర్‌: అఖిల్‌ గొగొయ్‌

తాజా వార్తలు

Published : 03/07/2021 01:17 IST

భాజపాలో చేరాలని ఎన్‌ఐఏ ఆఫర్‌: అఖిల్‌ గొగొయ్‌

గువాహటి: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద నమోదైన రెండు కేసుల్లో నిర్దోషిగా బయటపడిన అస్సాంకు చెందిన రైజోర్‌ దశ్‌ అధినేత, ఆర్టీఐ కార్యకర్త అఖిల్‌ గొగొయ్‌ ఎన్ఐఏపై సంచలన ఆరోపణలు చేశారు. భాజపాలో గానీ, ఆరెస్సెస్‌లో గానీ చేరితే 10 రోజుల్లోనే బెయిల్‌ వస్తుందని తనకు ఆఫర్‌ చేసిందని, లేదంటే 10 ఏళ్ల పాటు జైలు జీవితం తప్పదని హెచ్చరించిందని చెప్పారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

భాజపాలో చేరితో మంత్రి పదవి కూడా లభిస్తుందని ఎన్‌ఐఏ అధికారి ఒకరు ఆఫర్‌ చేసినట్లు అఖిల్‌ గొగొయ్‌ పేర్కొన్నారు. అందుకు తాను తిరస్కరించానని చెప్పారు. ఎన్‌ఐఏను కేంద్రంలోని భాజపా ఓ అస్త్రంగా వాడుకుంటోందని ఆరోపించారు. తనపై అభియోగాలను కోర్టు కొట్టివేయడం చరిత్రాత్మకమైన తీర్పుగా అభివర్ణించారు. ఈ తీర్పు ద్వారా ఉపా, ఎన్‌ఐఏ చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని తేలిందన్నారు. సీబీఐ, ఈడీలానే ఎన్‌ఐఏ కూడా ఓ రాజకీయ సంస్థగా మారిందని ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019 డిసెంబరులో అస్సాంలో చోటుచేసుకున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. వాటిలో అఖిల్‌ పాత్ర ఉందంటూ ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. రెండు కేసులను నమోదుచేసింది. ఆయన నిర్దోషి అంటూ ఇప్పటికే ఓ కేసులో తీర్పు వెలువడగా.. రెండో కేసులోనూ గురువారం ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అస్సాంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అఖిల్‌ జైల్లో ఉంటూనే శివసాగర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని