నక్సల్స్‌పై పోరు మరింత ఉద్ధృతం: అమిత్ షా 
close

తాజా వార్తలు

Published : 05/04/2021 17:31 IST

నక్సల్స్‌పై పోరు మరింత ఉద్ధృతం: అమిత్ షా 

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. సోమవారం జగ్దల్‌పూర్‌కు విచ్చేసిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, దేశం తరఫున నివాళులర్పించారు. నక్సల్స్‌పై పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లను దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. జగ్దల్‌పూర్‌లోని పోలీస్‌ సమన్వయ కేంద్రంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం భూపేశ్‌ బఘెల్‌, భద్రతా బలగాల అధికారులతో బిజాపూర్‌ అటవీప్రాంతంలో పరిస్థితులపై సమీక్షించినట్టు చెప్పారు. నక్సల్స్‌ను నియంత్రించడంతో బలహీనపడకూడదని, వీర జవాన్ల మనో ధైర్యాన్ని చెక్కుచెదరనీయకుండా తగినరీతిలో ముందుకెళ్లాలని అధికారులు తనతో చెప్పారన్నారు.

జవాన్ల సాహసాన్ని, త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా యావత్‌ దేశం నిలబడుతుందని చెప్పారు. దేశంలో నక్సల్స్‌ సృష్టిస్తున్న అశాంతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటాన్ని ముగింపు దశకు చేర్చాలని దృఢ నిశ్చయంతో ఉన్నామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేయడంతో పాటు వామపక్ష తీవ్రవాదాన్ని కట్టడిచేసేందుకు పనిచేస్తోందని చెప్పారు. నక్సల్స్‌ని నియంత్రించే చర్యల్ని మరింత ఉద్ధృతం చేస్తామని, ఈ పోరాటంలో విజయం మనదే అవుతుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానని అమిత్‌ షా పేర్కొన్నారు. బీజాపూర్‌-సుక్మా అటవీ ప్రాంతంలో శనివారం రోజున మావోయిస్టులు - పోలీసుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22మంది భద్రతాసిబ్బంది అమరులైన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని