మావోయిస్టులకు దీటైన సమాధానమిస్తాం!
close

తాజా వార్తలు

Published : 05/04/2021 01:22 IST

మావోయిస్టులకు దీటైన సమాధానమిస్తాం!

హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరిక

గువాహటి: మావోయిస్టులు రక్తపాతాన్ని సృష్టించడాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలో పర్యటిస్తోన్న అమిత్‌ షా, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన నేపథ్యంలో ఆయన హుటాహుటీన దిల్లీకి ప్రయాణమయ్యారు.

బీజాపూర్‌, సుకుమా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాన్లతో పాటు మావోయిస్టుల వైపు ప్రాణనష్టం సంభవించిందని కేంద్ర హోంశాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై పూర్తి వివరాలు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆచూకీ లభించని జవాన్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అమిత్‌ షా వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమరులైన జవాన్ల త్యాగాలు ఎన్నటికీ వృథా పోవని స్పష్టం చేశారు. అస్సాంలోని ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి హిమంతా బిస్వకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ప్రచార సమావేశంలో మాట్లాడకుండానే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా దిల్లీకి బయలుదేరిన హోంమంత్రి, ఛత్తీస్‌గఢ్‌ పరిణామాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

అధికారుల సమాచారం ప్రకారం, ఎన్‌కౌంటర్‌లో మొత్తం 24మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరందరినీ గుర్తించినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో 9 మంది కోబ్రా సిబ్బంది, 8 మంది డీఆర్జీ సిబ్బంది, 6గురు ఎస్పీఎఫ్‌, బస్తర్‌ బెటాలియన్‌ జవాన్‌లు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని