
తాజా వార్తలు
రాహుల్ మాటలకు నవ్వొస్తోంది: జావడేకర్
దిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన అత్యయిక పరిస్థితి గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా స్పందించింది. ఆ సమయంలో రాజ్యాంగ వ్యవస్థలు బలహీనం కాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయని ఎద్దేవా చేసింది. ‘అత్యయిక పరిస్థితి విధించిన సమయంలో దేశంలో వ్యవస్థలు బలహీనం కాలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. అప్పటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ అణచివేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలను అరెస్టు చేసింది. దాదాపు అన్ని పార్టీలపై నిషేధం విధించింది. వార్తా పత్రికలను కట్టడి చేసింది’ అని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆనాటి పరిస్థితులను వివరించారు.
అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి స్పందించారు. ‘ఆర్ఎస్ఎస్ గురించి అర్థం చేసుకోవాలంటే, రాహుల్‌కి చాలా సమయం కావాలి. ప్రపంచంలోనే దేశభక్తిని గురించి బోధించే అతిపెద్ద సంస్థ అది’ అంటూ ఆయనపై విమర్శలు చేశారు. దేశ మాజీ ఆర్థిక సలహాదారు, కార్నెల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కౌశిక్ బసుతో మంగళవారం జరిపిన ఓ చర్చా కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో అత్యయిక పరిస్థితి విధింపు కచ్చితంగా పొరపాటేనని, ఆమె కూడా ఆ విషయాన్ని అంగీకరించారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేస్తూ.. ఆ సంస్థ దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను తన మనుషులతో నింపివేస్తోందని ఆరోపించారు.