టాటా, బిర్లా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చా?

తాజా వార్తలు

Updated : 20/07/2021 16:53 IST

టాటా, బిర్లా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చా?

సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు

దిల్లీ: టాటా, బిర్లా, అంబానీ వంటి ప్రముఖుల బ్యాంకు డిపాజిట్లు, రుణాలకు సంబంధించిన సమాచారాన్ని సామాన్య పౌరులు తెలుసుకునే అవకాశం ఉందా?అన్న అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు జరిగాయి. బ్యాంకుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ‘సమాచార హక్కు చట్టం’ కింద అందజేయాలని ఆరేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం ఆర్‌బీఐని ఆదేశించింది. దీన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజాలైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సుప్రీంను ఆశ్రయించాయి. వీరి అభ్యర్థనలకు న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్‌ 29న తోసిపుచ్చింది.

ఎస్‌బీఐ తరఫున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, హెచ్‌డీఎఫ్‌సీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీంలో వాదనలు వినిపించారు. వ్యక్తుల ఖాతాలతో పాటు బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు బ్యాంకుల పరిధిలో రహస్యంగా ఉంటాయని జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నాజిర్‌, జస్టిస్‌ కష్ణా మురారీతో కూడిన ధర్మాసనానికి వివరించారు. సుప్రీం ఇచ్చిన తీర్పు వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన నిబంధనలు గందరగోళంగా మారే అవకాశం ఉందని వివరించారు.

ఓ ఖాతాదారుడు పెట్టుకున్న విశ్వాసాన్ని బ్యాంకులు ఎలా వమ్ము చేస్తాయని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. అలాగే ఒక వ్యక్తి ఆర్‌టీఐ ద్వారా తెలుసుకోవాలనుకున్నంత మాత్రాన బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎలా ఇవ్వగలమన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే బిజినెస్‌ కోసం తీసుకున్న రుణం సహా ఇతర రహస్య సమాచారం శత్రువుల చేతికి చేరే ప్రమాదం ఉందన్నారు. ఇలా సమాచారం ఇస్తే వాణిజ్య రహస్యాలు బయటకు పొక్కే అవకాశం ఉందని రోహత్గీ వాదించారు. వ్యక్తిగత గోప్యత జీవించే హక్కులో భాగమేనని సుప్రీం స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మరి బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాలకు సంబంధించిన గోప్యతను మెయింటైన్‌ చేయాల్సిన హక్కు లేదా?అని ప్రశ్నించారు.

ఈ విషయంపై తాజాగా మరోసారి బ్యాంకులు కోర్టును ఆశ్రయించడాన్ని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ నిరసించారు. తీర్పును పునఃసమీక్షించాలన్న అభ్యర్థనను కోర్టు ఇప్పటికే తోసిపుచ్చిందని గుర్తుచేశారు. అయితే, ఈ కేసు చాలా ప్రాచుర్యం పొందిందని.. ఇండియన్ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌లో భాగంగా ఉన్న బ్యాంకులన్నీ ఇందులో కక్షిదారులేనని తెలిపారు. కానీ, ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్ తప్ప ఎవరూ వాదనల్లో పాల్గొనలేదని గుర్తుచేశారు. ఇప్పుడు వచ్చి తమ వాదనను పరిగణనలోకి తీసుకోవాలనడం సమంజసం కాదని కోర్టుకు తెలిపారు.

ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఏప్రిల్‌ 29న బ్యాంకుల అభ్యర్థనను తోసిపుచ్చిన జస్టిస్‌ ఎల్‌.ఎన్‌.రావు నేతృత్వంలోని ధర్మాసనానికే ఈ కేసు విచారణను తిరిగి పంపనున్నట్లు వెల్లడించింది. దీనిపై తిరిగి గురువారం విచారణ జరగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని