మీడియా శక్తిమంతమైంది..దాన్ని నిలువరించలేం

తాజా వార్తలు

Updated : 03/05/2021 13:01 IST

మీడియా శక్తిమంతమైంది..దాన్ని నిలువరించలేం

సుప్రీంకోర్టు

దిల్లీ: కోర్టుల్లో జరిగే విచారణను నివేదించకుడా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మీడియా చాలా శక్తిమంతమైందని.. న్యాయస్థానంలో ఏం జరుగుతుందో దాన్ని బయటకు తెలియజేస్తుందని వ్యాఖ్యానించింది. దేశంలో కొవిడ్‌-19 కేసుల పెరుగుదలకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, వారిపై హత్యానేరం కింద విచారణ చేపట్టవచ్చని మద్రాస్‌ హైకోర్టు ఇటీవల చేసిన మౌఖిక వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(ఈసీ) వేసిన పిటిషన్‌ను విచారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. 

కోర్టు తీర్పులే కాకుండా విచారణలో భాగంగా లేవనెత్తే ప్రశ్నలు, సమాధానాలు, వాదనలపై కూడా పౌరులకు పట్టింపు ఉంటుందని సుప్రీం కోర్టు ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనల్ని మీడియా ప్రచురించకపోవడం అనేది ఆచరణకు చాలా దూరమైన అంశమని తెలిపింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ.. కొవిడ్‌ విజృంభణకు సంబంధించి సంబంధిత విపత్తు నిర్వహణ అధికారుల నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే, ఎన్నికల సంఘానికి కనీసం ఒక అవకాశం ఇవ్వకుండానే నిందిస్తున్నారని తెలిపింది. దీనికి కోర్టు స్పందిస్తూ ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని పేర్కొంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కోర్టులు కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటాయని తెలిపింది. వాటిని ఈసీ సరైన దారిలో వెళ్లే కమ్రంలో తీసుకునే చేదు గుళికల్లా భావించాలని హితవు పలికింది.

ఈ సందర్భంగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. హైకోర్టులను తక్కువ చేయడం తమకు ఇష్టం లేదని తెలిపారు. న్యాయవ్యవస్థకు అవి మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. విచారణలో భాగంగా కొన్నిసార్లు న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారని.. కోర్టును ఎలా నిర్వహించాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. అసౌకర్యమైన ప్రశ్నలు సంధించే స్వేచ్ఛ హైకోర్టు న్యాయమూర్తులకు ఉంటుందని పేర్కొన్నారు. 

దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. మద్రాస్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు విచారణలో భాగంగా చేసినవి కాదని.. అది వారి నిర్ధారణ అని తెలిపింది. పైగా వాటిని తుది ఆదేశాల్లోనూ చేర్చలేదని పేర్కొంది. దీనిపై జస్టి షా స్పందిస్తూ.. అన్నింటినీ ఆదేశాల్లో చేర్చలేమని.. అది సహజంగా జరిగే ప్రక్రియ అని వ్యాఖ్యానించారు.

మద్రాస్‌ హైకోర్టు ఏమందంటే...

అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఎన్నికల సంఘమే (ఈసీ) దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతికి కారణమని మద్రాస్‌ హైకోర్టు గత సోమవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులకు ఆ సంస్థదే బాధ్యతని స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులపై హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయవచ్చునని వ్యాఖ్యానించింది. ఎన్నికల ర్యాలీలు, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇవ్వడం.. దేశంలో మహమ్మారి రెండో దశ తీవ్రతకు కారణమైందని పేర్కొంది. ఆ సమయంలో అధికారులు వేరే గ్రహం మీద ఉన్నారా? అని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు కఠోరంగా, అవమానకరంగా ఉన్నాయంటూ ఈసీ తాజాగా సుప్రీంకోర్టు ఆశ్రయించగా దానిపై నేడు విచారణ జరిగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని